కోవిడ్ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైంది..
Ens Balu
3
Kakinada
2021-02-20 17:44:56
కోవిడ్-19 టీకా అత్యంత సురక్షితమైందని.. లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జి.రాజకుమారి పేర్కొన్నారు. శనివారం కాకినాడలోని సూర్యనారాయణపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం (యూపీహెచ్‌సీ)లో జేసీ రాజకుమారి, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం జేసీ మాట్లాడుతూ కోవిడ్ క్లిష్ట సమయంలో వైద్యం, ఆరోగ్యం; పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్, గ్రామీణాభివృద్ధి, సంక్షేమం తదితర శాఖల సిబ్బంది ఎంతో సేవ చేశారని తెలిపారు. కోవిడ్ బాధితులకు సరైన చికిత్స అందించడంతో పాటు ఎవరికి ఏ అవసరమొచ్చినా మేమున్నామంటూ భరోసా కల్పించారన్నారు. ముందుగా వీరందరికీ వ్యాక్సిన్ వేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు తొలిదశలో హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించినట్లు తెలిపారు. రెండో దశలో ఫ్రంట్‌లైన్ వర్కర్లు అందరికీ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోందని.. ఇందులో భాగంగా శనివారం యూపీహెచ్‌సీలో వ్యాక్సిన్ వేయించుకున్నట్లు వివరించారు. కలెక్టరేట్ ఉద్యోగులు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారని, వ్యాక్సిన్ వేయించుకున్న వారు తమ సహోద్యోగులకు కూడా తెలియజేసి వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని, ఆరోగ్యకర సమాజానికి కృషి చేయాలని కోరారు. మొబైల్‌కు వచ్చిన సందేశాల ప్రకారం కలెక్టరేట్ సిబ్బంది సూర్యనారాయణపురం యూపీహెచ్‌సీలో వ్యాక్సిన్ వేయించుకున్నట్లు డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు తెలిపారు. అందుబాటులో ఉన్న సురక్షితమైన వ్యాక్సిన్‌ను ఫ్రంట్‌లైన్ వర్కర్లందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ప్రియాంక, డాక్టర్ ఐ.లిఖిత, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.