ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే..
Ens Balu
3
Tirupati
2021-02-20 18:04:23
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొవిడ్ నియమ నిబంధనలను అనుసరిస్తూ నాల్గవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేపు తిరుపతి డివిజన్ కు చెందిన 13 మండలాల్లో 221 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 4 విడతలో తిరుపతి డివిజన్ కు సంబందించి 14 మండలాల ఎన్నికలు నిర్వహణతో పాటు మొదటి విడతలో చిత్తూరు డివిజన్ లోని బంగారుపాళ్యం మండలానికి సంబందించి కల్లూరుపల్లి పంచాయతీ లోని ఒక వార్డుకు పోటీ చేసిన అభ్యర్ధి మరణించడంతో ఆ పంచాయతీ లోని ఒక వార్డు స్థానానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు నాల్గవ విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టగా కల్లూరుపల్లి పంచాయతీలోని ఆ వార్డు ఏకగ్రీవం కావడం మరియు తిరుపతి డివిజన్ కు సంబందించిన పులిచెర్ల మండలం లోని అన్ని సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలు ఏకగ్రీవం కావడంతో ఈ నెల 21 న తిరుపతి డివిజన్ కు చెందిన 13 మండలాలలో నాల్గవ విడత ఎన్నికల నిర్వహణ జరుగుతుందని తెలిపారు.
నాల్గవ విడతలో మొత్తం 15 మండలాలలో 397 గ్రామ పంచాయతీలకు గాను వివిధ కారణాల రీత్యా 22 పంచాయతీలు మినహా 375 పంచాయతీలకు, 3,649 వార్డులలో 188 వార్డుల మినహా 3,461 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ విడదల చేయడం జరిగిందని తెలిపారు. అందులో 154 గ్రామ పంచాయతీలు, 2066 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నిక అయినందున మరియు 20 వార్డు మెంబర్లకు నామినేషన్లు ధాఖలు కానందున మిగిలిన 221 సర్పంచ్ లకు మరియు 1,375 వార్డు మెంబర్లకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో 2,93,504 మంది పురుషులు, 3,05,612 మంది స్త్రీలు మరియు 70 మంది ఇతరులు మొత్తం 5,99,186 మంది ఓటర్లు పాల్గొననున్నారని తెలిపారు. ఈ విడతలో 221 సర్పంచ్ స్థానాలకు గాను 618 మంది, 1375 వార్డ్ మెంబర్ల స్థానాలకు గాను 3055 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,765 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 541 అత్యంత సమస్యాత్మక మరియు 389 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ పోలింగ్ కు సంబంధించి 215 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందని మరియు ఈ పోలింగ్ కేంద్రాలకు అవసరమైన స్థాయిలో పోలీసు బందోబస్త్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి 3,107 పెద్దవి, 1,025 చిన్న బ్యాలెట్ బాక్స్ లను సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలించామని తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 108 మంది స్టేజ్ – 1 మరియు 94 మంది స్టేజ్ – 2 ఆర్ఓ లను, 2044 మంది పోలింగ్ అధికారులు(పి ఓ లు ), 414 మంది ఏఆర్ఓ లను, 29 మంది జోనల్ ఆఫీసర్లను, 86 మంది రూట్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సిబ్బంది మరియు సామగ్రి తరలింపుకు అవసరమైన 159 బస్సుల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొంటున్నారని తెలిపారు. ఎన్నికల సామగ్రి తరలింపుకు 14 సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కొవిడ్ దృష్ట్యా ఎన్నికల సిబ్బందికి 19,960 మాస్కులు, 1,765 లీటర్ల హ్యాండ్ స్యానిటైజర్లు, 19,960 హ్యాండ్ గ్లౌజ్ లు అందజేయడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, కవర్లు, బుక్లెట్లు, రబ్బరు స్టాంప్ లు వంటి ఇతర సామగ్రిని ఎంపిడిఓ లకు సమకూర్చడం జరిగిందన్నారు. 4వ విడత పోలింగ్ ఉదయం 6.30 గం.ల నుండి మ.3.30 గం.ల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఆ వెంటనే ఓట్ల లెక్కింపునకు సంబంధించి 251 మంది సూపర్ వైజర్లు, 753 మంది కౌంటింగ్ స్టాఫ్ ను నియమించామన్నారు.