ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు మెరుగు పరచాలి..
Ens Balu
1
Kakinada
2021-02-20 19:58:22
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించే వైద్య సేవలు మరింత మెరుగు పరచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ నుంచి జేసీ కీర్తి చేకూరి ఏరియా ఆసుపత్రులు,వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న పి.హెచ్.సి డాక్టర్లతో ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యం, ఆరోగ్యశ్రీ పథకం సేవలు, ఇతర అంశాలపై జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా అందించె వైద్య, ఆరోగ్యశ్రీ సేవలు మరింత మెరుగు పరచడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు మెరుగుపరచడానికి అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఏరియా ఆస్పత్రులు, పీహెచ్సీలలో సర్జరీ లకు అవసరమైన యంత్రపరికరాలు కొరతగా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఎమర్జెన్సీ కేసులు వేరే ఆస్పత్రులకు బదిలీ చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స అందించాలి అన్నారు. వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రులకు ఏ సమయంలో ప్రజల వచ్చిన నిరాకరించడానికి వీలు లేదన్నారు. రాత్రి సమయాల్లో కూడా డాక్టర్లు అందుబాటులో ఉండాలని జేసీ తెలిపారు. జిల్లాలో మాతృ శిశు మరణాలు నియంత్రణకు వైద్యులు ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉత్తమ సేవలు అందించడం ద్వారా ప్రజలలో మన్ననలు పొందవచ్చన్నారు.విధులలో అలక్ష్యం వహించే వైద్యులపై కఠిన చర్యలు తప్పవని ఆమె అన్నారు. గ్రామ స్థాయిలో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అందించే సేవల వివరాలను విస్తృత అవగాహన కల్పించాలని జెసి అధికారులకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాజమహేంద్రవరం డి సి హెచ్ ఎస్ డాక్టర్ పి రమేష్ కిషోర్, జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయ అధికారి డాక్టర్ పి రాధాకృష్ణ, డీయం కె నవిన్ , వివిధ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక డాక్టర్లు సూపరిండెంటులు ఇతర అధికారులు పాల్గొన్నారు.