కరోనా వేక్సినేషన్ సత్వరం పూర్తిచేయాలి..
Ens Balu
4
Anantapur
2021-02-20 20:43:33
అనంతపురం జిల్లాలో హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకు వేస్తున్న కరోనా వ్యాక్సిన్ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ పురోగతిపై మెడికల్ అధికారులు ,ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, డి ఎం హెచ్ ఓ, డి ఐ ఓ, తహసిల్దార్ లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వ్యాక్సినేషన్ ఏ మండలం, పి హెచ్ సి ,ఏ సబ్ సెంటర్ లో కూడా 60 శాతం మించ లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ వేయించిన శాతం ఇతర జిల్లాలతో పోలిస్తే అట్టడుగు నుంచి రెండవ స్థానంలో అనంతపురం జిల్లా నిలిచిందన్నారు. అనంతపురం జిల్లా వివిధ శాఖల కార్యక్రమాలలో అగ్రస్థానంలో ఉండగా, వ్యాక్సినేషన్ లో మాత్రం అట్టడుగు స్థానంలో ఉందన్నారు. జిల్లా వ్యాక్సినేషన్ శాతం సరాసరి 32 శాతం మాత్రమేనన్నారు. జె సి, డి ఎం హెచ్ ఓ వ్యాక్సినేషన్ పై నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నా పురోగతి రావడం లేదన్నారు. దీన్ని అధిగమించి 100% పురోగతికి తీసుకురావాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్ల మండలాల వారి వ్యాక్సినేషన్ డాటా పరిశీలిస్తే కూడేరు, అమరాపురం, 59 శాతం, పెనుగొండ 60 శాతం వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. ఈ మండలాలకు చెందిన అధికారులందరినీ అభినందిస్తున్నానన్నారు. గోరంట్ల ,గుంతకల్, కనగానపల్లె 14 శాతం, ఒడిసి మండలాల్లో 16% మాత్రమే అతి తక్కువగా వ్యాక్సినేషన్ జరిగిందన్నారు.
వ్యాక్సినేషన్ తీసుకోవడంపై మెసేజ్లు పంపుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ లబ్ధిదారులు మాత్రం మెసేజ్ లు రావడం లేదని తనకు తెలిపారన్నారు. ఈ అంశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది అన్నారు. తక్కువ వ్యాక్సినేషన్ జరగడంపై ఎన్నికలు జరుగుతున్నందువల్ల ,స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని పలు కారణాలు చెబుతున్నారన్నారు. ఇది సరి కాదని ,ఇతర జిల్లాలలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయని ఆ జిల్లాలో వ్యాక్సినేషన్ 90% జరిగిందన్నారు.
మున్సిపల్ ,రెవిన్యూ, పంచాయతీరాజ్ ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నారు. మున్సిపల్ ,పంచాయతీ రాజ్ శాఖలలో వ్యాక్సినేషన్ శాతం చాలా తక్కువగా ఉందన్నారు. రెవెన్యూ శాఖలో వీరికన్నా కొంత పురోగతి ఉందన్నారు. తాను కూడ వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగిందని, తనకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని, తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని కలెక్టర్ తెలిపారు .
మెడికల్ అధికారులందరూ, ఐసిడిఎస్, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్, డివిజనల్ పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ, వార్డు కార్యాలయ సిబ్బంది అందరు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలన్నారు. హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ తీసుకునేందుకు ఈ నెల 25వ తేదీ చివరి రోజు అన్నారు .మెడికల్ అధికారులు బాధ్యత తీసుకొని అందరికీ వ్యాక్సిన్ చేయించాలన్నారు. ఇప్పటివరకు 42 శాతం మాత్రమే హెల్త్ కేర్ వర్కర్లు వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగిందన్నారు. ఈ అంశంలో డిఐ ఓ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఇకనైనా డి ఐఓ ,డి ఎం హెచ్ ఓ ,మెడికల్ అధికారులు అందరూ కలిసి పూర్తిస్థాయిలో హెల్త్కేర్ వర్గాలకు వ్యాక్సినేషన్ చేయించాలన్నారు. కొన్ని మండలాల్లో హెల్త్ కేర్ వర్కర్ల వ్యాక్సినేషన్ శాతం జీరో గా ఉందన్నారు. ఆ ప్రాంత మెడికల్ అధికారులు ఎలాంటి శ్రద్ధ చూపినట్లు తెలుస్తోందని, అలాంటి వారిని సస్పెండ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
గుంటకల్ 44%, తలుపుల 53% ,ఎన్ పి కుంట 55% ,ధర్మవరం మెడికల్ అధికారుల పరిధిలో 68 శాతం ఇంకా వ్యాక్సిన్ చేయించుకోవాల్సి ఉందన్నారు. రానున్న రెండు రోజుల్లోపు 10 శాతం కన్నా ఎక్కువ పెండింగ్ ఉన్న మెడికల్ అధికారుల పరిధిలోని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు .ఇకనైనా వాక్సినేషన్ పై పూర్తి స్థాయిలో సన్నద్దం చేసి, అవగాహన కల్పించి, హెల్త్కేర్ వర్కర్ల అందరికీ వ్యాక్సినేషన్ చేయించాల్సిన బాధ్యత మెడికల్ అధికారులదే నని ఆయన అన్నారు .అంగన్వాడీ వర్కర్ల లో మడకశిర 42 శాతం ,సికేపల్లి 49 శాతం, కదిరి ,బొమ్మనహల్ మండలాల్లో 71% ఇంకా వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సి ఉందని, ఈ ప్రాంత ఎంపీడీవో, తాసిల్దారు ,ఇతర అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తిస్థాయిలో వాక్సినేషన్ చేయించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు, ఫ్రంట్లైన్ వర్కర్ల లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ,అర్బన్ డెవలప్ మెంట్ లో పురోగతి చాలా తక్కువగా ఉందని ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ వేయించాలని ఆదేశించారు, పంచాయతీరాజ్ లో ఓవరాల్గా 75% వ్యాక్సిన్ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ అంశంపై డివిజనల్ పంచాయతీ అధికారులు ,ఎంపీడీవోలు ప్రత్యేక బాధ్యత తీసుకొని అందరికీ వ్యాక్సినేషన్ చేయించాలన్నారు .రెవిన్యూ లో 63 శాతం మంది తీసుకోవాల్సి ఉందని ,ఇందుకోసం తాసిల్దారు, సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని, మిగిలిన వారందరూ కూడా వ్యాక్సినేషన్ చేయించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.
హెల్త్ కేర్ వర్కర్లు ఈనెల 23వ తేదీలోపు ,ఫ్రంట్లైన్ వర్కర్లు మరో వారం రోజుల్లోపు 100% వాక్సినేషన్ చేయించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు .ఇందుకు సంబంధించి తాను ,జేసీ పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ప్రతి రోజు ఉదయం 12 గంటలకు, సాయంత్రం 5 గంటలకు డి ఐ ఓ, డి ఎం హెచ్ ఓ సమన్వయం చేసుకొని నివేదికలను అందించాలన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (.అభివృద్ధి ) డాక్టర్ ఏ .సిరి పాల్గొన్నారు.