తుది దశ ఎన్నికలు ప్రశాంతం..
Ens Balu
3
Srikakulam
2021-02-21 14:58:58
శ్రీకాకుళం జిల్లాలో తుది దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నరసన్నపేట నియోజక వర్గ పరిధిలో గల శ్రీకాకుళం, గార, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం, పొలాకి, నరసన్నపేట, జలుమూరు, సారవకోట మండలాల్లో తుది విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ జె.నివాస్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్దార్ తో కలసి ఎచ్చెర్ల మండలంలోని ఫరీదుపేట, డి.మత్య్సలేశం, రణస్థలం మండలం జె.ఆర్.పురంతో పాటు వివిధ మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుది దశ పంచాయతీ ఎన్నికల్లో 274 పంచాయతీలకు గాను 259 పంచాయతీల్లోనూ, 2,658 వార్డులకు గాను 1,915 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నట్లు చెప్పారు. సర్పంచ్ పదవికి 661 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వార్డుల కొరకు 4,202 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. ఉదయం 06.30 నుండి మధ్యాహ్నం 03.30 గం. ల వరకు జరుగుతున్న ఈ పోలింగులో 4,88,625 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న అన్ని ప్రాంతాలతో పాటు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో మధ్యాహ్నం 12.30 గం.లకు 62.07 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ తెలిపారు.