మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి..
Ens Balu
2
Anantapur
2021-02-21 18:16:43
అనంతపురం జిల్లాలో మున్సిపల్, అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. ఆదివారం అనంతపురం నగరంలోని శ్రీ సాయిబాబా నేషనల్ ఎయిడెడ్ హై స్కూల్ లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు, సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ. సిరితో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ను పటిష్టంగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బందికి, ఏజెంట్లకి ఐడి కార్డులు అందజేయాలన్నారు.
ఈ సందర్భంగా మ్యాప్ ద్వారా కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటును జిల్లా కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. కౌంటింగ్ కోసం టేబుల్స్ ఏర్పాటు, కౌంటింగ్ సిబ్బంది నియామకం, ఎలా టేబుల్స్ ఏర్పాటు చేయాలి అనే విషయాలపై చర్చించారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ నాగరాజు, ఆర్ డి ఓ గుణభూషణ్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ శోభ స్వరూపరాణి, నగరపాలక సంస్థ కమిషనర్ పివిఎన్ఎన్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.