విజయనగరం జిల్లిలో  87.09 శాతం పోలింగ్..


Ens Balu
2
Vizianagaram
2021-02-21 18:43:16

విజయనగరం డివిజన్ లో 4వ విడతలో 10 మండలాలలో ఆది వారం జరిగిన పంచాయితీ ఎన్నికలలో 87.09 శాతం ఓటింగ్ నమోదు జరిగిందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ వెళ్లడించారు. రాష్ట్రం లోనే ఓటింగ్ శాతం  అధికంగా   నమోదైన జిల్లాగా విజయనగరం నిలిచిందని అన్నారు. 3వ విడత లో కూడా  మన జిల్లానే మొదటి స్థానం లో ఉందని,  ఓటర్ ను చైతన్య పరచడం లో జిల్లా ఎన్నికల అథారిటీ  సాధించిన విజయమిదని అభివర్ణించారు. ఆదివారం కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి కలెక్టర్ పోలింగ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మూడు విడతలలో జరిగిన ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించిన పంచాయతి రాజ్, రెవిన్యూ, పోలీస్, ఇతర శాఖలకు, సహకరించిన మీడియా కు అభినందనలు తెలిపారు.  కౌటింగ్ కూడా త్వరగా పూర్తయ్యేలా కౌంటింగ్ టేబుళ్ళ సంఖ్య ను, కౌంటింగ్ సిబ్బందిని పెంచడమే కాకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, రాత్రి 10 గంటల కెల్లా ఫలితాలను వెలువడేలా చూస్తున్నామని అన్నారు. ఉదయం 6 గంటల నుండే కంట్రోల్ రూమ్ కు చేరుకొని  పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ  అక్కడక్కడా జరిగిన చిన్న చిన్న లోపాలను  అప్పటికప్పుడే పరిష్కరించడం జరిగిందన్నారు.  ఎన్నికలను సజావుగా జరిగేలా పర్యవేక్షించడానికి ప్రతి మండలానికి ఒక ఉప కలెక్టర్ స్థాయి అధికారిని నియమించడం జరిగిందన్నారు.           4వ విడత పోలింగ్ లో మెంటాడ, దత్తిరాజేరు, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, జామి, ఎస్.కోట, వేపాడ, ఎల్.కోట , కొత్తవలస 10 మండలాల్లోనూ, నెల్లిమర్ల లో ఒమ్మి పంచాయతి లో 4వ వార్డ్ లో   3 లక్షల 88 వేల 650 మంది ఓటర్ల వుండగా ఓటింగ్ ముగిసే సమయానికి 3 లక్షల 38 వేల 488 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఉదయం 8.30 గంటలకు 22.5 శాతం, 10.30 గంటలకు 54.7 శాతం, 12.30 గంటలకు 77.2 శాతం, 2.30 గంటలకు 85.6 శాతం నమోదు కాగా పోలింగ్ ముగిసే సమయం 3.30 గంటలకు  87.09 శాతం నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు.  అత్యల్పంగా 82.88 శాతం  గరివిడి మండలంలో నమోదు కాగా, అత్యధికంగా 91 శాతం ఎల్.కోట లో నమోదైందని, నెల్లిమర్ల మండలం ఒమ్మి లో 94.48 శాతం  నమోదయిందని తెలిపారు.