దామోదరం సంజీవయ్య భవనంగా మార్పు..
Ens Balu
3
Anantapur
2021-02-21 20:14:47
అనంతపురం జిల్లాలో గతవారం జరిగిన దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 100వ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా ఎన్నికల పరిశీలకులు (రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్) హర్షవర్ధన్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నేతృత్వంలో పెన్నార్ భవన్ సముదాయాన్ని దామోదరం సంజీవయ్య భవన్ గా పేరు మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం నగరంలోని పెన్నార్ భవన్ ప్రవేశ ద్వారానికి మునిసిపల్ కార్పొరేషన్ వాహన నిచ్చెన సహాయంతో దామోదరం సంజీవయ్య భవన్ గా నామకరణం చేస్తూ బోర్డుపై జిల్లా ఎన్నికల పరిశీలకులు మరియు జిల్లా కలెక్టర్ లు ఒక అక్షరానికి లాంఛనంగా పెయింటింగ్ వేసి ప్రారంభించారు. అలాగే కార్యాలయపు గోడలపై భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ మరియు గౌతమ బుద్ధుని చిత్రాలను పెయింటింగ్ వేసే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ప్రహరీ గోడలను అందంగా తయారు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) గంగాధరగౌడ్, సాంఘిక సంక్షేమశాఖ శాఖ డి డి విశ్వ మోహన్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇన్చార్జ్ యుగంధర్, సిపిఓ ప్రేమ్ చంద్, ఈ ఈ శివకుమార్, డి టి డబ్ల్యూఓ అన్నాదొర, మున్సిపల్ కమిషనర్ పి వి విఎస్ మూర్తి, సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు మరియు బీసీ కళాశాల విద్యార్థినివిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.