అనంత వాసులకు తీరున్న పెద్దాసుపత్రి కల..
Ens Balu
3
Anantapur
2021-02-22 14:11:29
దశాబ్దం పాటు ఎదురుచూస్తున్న అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ పనులకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సమర్థవంతమైన కృషితో మోక్షం లభించింది. ప్రభుత్వం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ పనులకు అవసరమైన స్థల సేకరణ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించడంతో ఆగమేఘాలపై ఆస్పత్రి విస్తరణ కోసం అవసరమైన స్థలాలను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ముందుండి నడిచి, జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను నడిపించి జిల్లా వాసుల కలను నెరవేర్చేలా పని చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో పదేళ్లపాటు ఎదురుచూస్తున్న కల సాకారం కానుంది. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బెడ్ల కెపాసిటీ 560 నుంచి 1200 పడకలకు విస్తరణ చేయాలని దశాబ్దకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా కొన్ని రాజకీయ కారణాల వల్ల కదలిక లేని స్థితిలో ఆదేశాలు అందిన వెంటనే జిల్లా కలెక్టర్ అత్యంత సమర్థవంతంగా విస్తరణ పనుల కోసం అవసరమైన స్థలాలను వేగవంతంగా సేకరించారు. ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే అనతి కాలంలోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ పనుల కోసం అవసరమైన 12.79 ఎకరాల స్థలాలను సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆస్పత్రి విస్తరణ కోసం ప్రభుత్వం అంగీకరించడంతో త్వరలో విస్తరణ పనులు మొదలు కానున్నాయి.
విస్తరణ కోసం 12.79 ఎకరాల ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు :
ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న 7 ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను జిల్లా కలెక్టర్ అతి తక్కువ సమయంలో పరిశీలించి, జిల్లా యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించి విస్తరణ కోసం 12.79 ఎకరాలను సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అందులో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఫైర్ స్టేషన్, మున్సిపల్ గెస్ట్ హౌస్, నెహ్రూ బాల్ భవన్, కమాండ్ కంట్రోల్ సెంటర్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస్ బంగ్లా, డిఎంఅండ్హెచ్ఓ ఆఫీస్ ప్రాంతంలోని 4.47 ఎకరాలు, ఇరిగేషన్ కార్యాలయంలోని 3.82 ఎకరాలు, ఆర్ అండ్ బి ఆఫీస్ లోని 4.5 ఎకరాలు మొత్తం కలిపి 12.79 ఎకరాలను సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రతిపాదనలు పంపిన అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి విస్తరణకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంలో జిల్లా కలెక్టర్ కృషి ఎంతో ఉంది. జనరల్ ఆస్పత్రి విస్తరణకు సంబంధించి త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నారు.
ఇప్పటికే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రస్తుతం 8 లక్షల చదరపు అడుగులు ఉండగా, ఆస్పత్రి పరిసరాల్లోని 7 ప్రభుత్వ కార్యాలయాల్లో మరో 7 లక్షల చదరపు అడుగులలో విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపించడంతో ప్రభుత్వం విస్తరణ పనులకు అంగీకారం తెలపడం జరిగింది. ఇందుకు సంబంధించి 7 ప్రభుత్వ కార్యాలయాల భవనాలను త్వరలో ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ పనులకు అందజేయడం జరగనుంది.
ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ పనులకు స్థలాన్ని అందజేసిన 7 ప్రభుత్వ కార్యాలయాల భవనాల కోసం 52 కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ స్థలాలలో భవనాలు నిర్మించేందుకు అంచనాలను జిల్లా యంత్రాంగం రూపొందించింది. అప్పటివరకు 7 ప్రభుత్వ కార్యాలయాల కార్యకలాపాలను నగరంలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, సేవాసదన్ ( ఏపీ డెయిరీ)లో, వెటర్నరీ ఆఫీస్ న్యూ బిల్డింగ్ లో, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ న్యూ బిల్డింగ్స్, డిఆర్డిఏ ఆఫీస్, గిరిజన భవన్, రెడ్ క్రాస్ భవన్ లలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
అయితే 7 ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించేందుకు నగరంలోని టీబీ హెచ్ఎల్సీ దగ్గర 5.6 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలన చేసి గుర్తించి నిర్ణయించడం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మాణం కోసం స్థలాల అప్పగింత కార్యక్రమం త్వరలో జరగనుంది.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బెడ్ల కెపాసిటీ 560 నుంచి 1200 పడకలకు విస్తరణ ;
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బెడ్ల కెపాసిటీ 560 నుంచి 1200 పడకలకు విస్తరణ చేపట్టనున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ప్రతిరోజు 2 వేల నుంచి 2500 వరకు అవుట్ పేషెంట్ లు వస్తున్నారు. ఆస్పత్రిలో 200 నుంచి 250 మంది వరకు అడ్మిషన్లు, ప్రతి నెల 1000 వరకు డెలవరీలు, 400 వరకు సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతుండగా, ఆస్పత్రిలో మేజర్ సర్జరీలు 900 వరకు జరుగుతుంటాయి.
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో రాయలసీమలోని ఆస్పత్రులలో అవసరమైన వసతి సౌకర్యాలు తక్కువగా ఉండగా, జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా వసతి సౌకర్యాలు తక్కువగా ఉన్నా జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం లో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ పనులు చేపట్టి బెడ్ల కెపాసిటీ 560 నుంచి 1200 పడకలకు విస్తరణ చేపడితే అధునాతన వైద్య సదుపాయాలు రోగులకు అందించే వీలు కలుగుతుంది. ఇందుకోసం అవసరమైన స్థలాలను సేకరించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడంతో ఆస్పత్రి విస్తరణ పనులకు మార్గం సుగమమైంది. ఆస్పత్రి విస్తరణ వల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ల సంఖ్య కూడా 100 నుంచి 150 - 200 వరకు పెంచేందుకు అవకాశం ఏర్పడుతుంది. దశాబ్దం పాటు ఎదురు చూస్తున్న ఆస్పత్రి విస్తరణ పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి విస్తరణ పనులకు ఎంతగానో కృషి చేసిన జిల్లా కలెక్టర్ కు ప్రజలంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.