మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం..
Ens Balu
3
Vizianagaram
2021-02-22 16:31:52
విజయనగరం జిల్లాలో నిర్వహించబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. ఇది వరకు గుర్తించి నివేదించిన పది పోలింగ్ కేంద్రాలను మార్చనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సోమవారం జరిగిన వీడీయో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఈ మేరకు స్పందించారు. కలెక్టరేట్‌లోని ఎన్.ఐ.సి. కేంద్రం నుంచి నిర్వహించిన వీడీయో కాన్ఫరెన్స్‌లో ఆయన జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు కాంతిలాల్ దండే, ఎస్పీ రాజకుమారి, జేసీలు కిశోర్ కుమార్, మహేష్ కుమార్, వెంకటరావు, అసిస్టెంట్ కలెక్టర్ సింహాచలంతో కలిసి పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించి ఏమైనా అంశాలుంటే మాట్లాడాలని ఎన్నికల కమిషనర్ సూచించగా స్పందించిన కలెక్టర్ హరిజవహర్ లాల్ మున్నిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాట్లాడారు. జిల్లాలో ఇంకా కొన్ని చోట్ల నాడు-నేడు పనులు జరుగుతున్నందున కొన్ని కేంద్రాలు అందుబాటులోకి రాలేదని చెప్పారు. కావున ఆయా ప్రాంతాల్లో 10 ప్రత్యామ్న్యాయ కేంద్రాలను గుర్తించామని, కొత్తగా వాటిలోకి కేంద్రాలను మార్చుకునేందుకు అనుమతివ్వాలని ఎన్నికల కమిషనర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్ సంబంధిత వివరాలతో కూడిన నివేదిక సమర్పించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.
ముందుగా అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన ఎన్నికల కమిషనర్ మున్నిపల్ ఎన్నికల నిర్వహణకు అందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అన్ని జిల్లా అధికారులు, కలెక్టర్లు ప్రశంస పాత్రను పోషించారని కమిషనర్ కితాబిచ్చారు. అందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో రాబోయే మున్నిపల్, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితాలను ప్రదర్శించాలని చెప్పారు. వార్డుల వారీగా ఓటర్ల వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. అలాగే జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి గతంలో ఎవరైనా బెదిరింపులు ఇతరత్రా కారణాలతో నామినేషన్ వేయలేనట్లయితే వారికి తాజాగా అవకాశం కల్పించాలన్నారు. సంతృప్తికరమైన ఆధారాలను సమర్పించినప్పుడే ఎన్నికల అథారిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. సంబంధిత అభ్యర్థుల వివరాలతో కూడిన నివేదికను రెండు రోజుల్లోగా సమర్పించాలని చెప్పారు. అలాగే ఎన్నికల నిర్వహణలో కోవిడ్ నియమాలను అందరూ తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా సూచించారు.
కార్యక్రమంలో డీఆర్‌వో ఎం. గణపతి రావు, మున్సిపల్ కమిషనర్ ఎస్.ఎస్ వర్మ, లైజన్ అధికారి ఏవీ శ్యామ్‌కుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.