మున్సిపల్ ఎన్నికలు విజయవంతం చేయాలి..
Ens Balu
3
Vizianagaram
2021-02-22 16:36:50
గ‌్రామ పంచాయతీ ఎన్నికలను అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన తరహాలోనే మునిసిపల్ ఎన్నికలను కూడా ఇదే ఉత్సాహంతో మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని స్థానిక ఎన్నికల నిర్వహణకు సాధారణ పరిశీలకులుగా నియమితులైన సీనియర్ ఐ.ఏ.ఎస్.అధికారి, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే జిల్లా అధికారులను కోరారు. అందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాధారణ ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించిన సీనియర్ అధికారి కాంతిలాల్ దండే సోమవారం జిల్లాకు వచ్చారు. స్థానిక జిల్లాపరిషత్ అతిథిగృహంలో ఆయనకు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ స్వాగతం పలికి ఆయనతో భేటీ అయ్యారు. జాయింట్ కలెక్టర్లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.ఆర్.మహేష్ కుమార్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ కట్టా సింహాచలం తదితరులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్‌లతో మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలపై రాష్ట్రంలోనే అత్యధిక శాతం పోలింగ్ ఈ జిల్లాలో జరిగిన విషయమై జిల్లా కలెక్టర్ ఎన్నికల పరిశీలకులకు వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే పట్టణ ప్రాంత ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలని తద్వారా పంచాయతీ ఎన్నికలను మించి పోలింగ్ నమోదు జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ జిల్లా ప్రజలు శాంతి కాముకులని అందువల్ల పట్టణ స్థానిక ఎన్నికలను వారి సహకారంతో విజయవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ ఆయనకు వివరించారు. పోలీసు శాఖ పరంగా చేయనున్న బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా ఎస్.పి. బి.రాజకుమారి ఎన్నికల పరిశీలకులకు తెలిపారు. జిల్లా పాలన యంత్రాంగంతో సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఘటనలకు తావులేకుండా చర్యలు చేపడుతున్నామని, ఈ కారణంగానే మూడు విడతల్లోనూ ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయన్నారు.
జాయింట్ కలెక్టర్లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.ఆర్.మహేష్ కుమార్, జె.వెంకటరావు, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ కట్టా సింహాచలం తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.