జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం..


Ens Balu
3
Srikakulam
2021-02-22 16:40:20

శ్రీకాకుళంజిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. జిల్లాలో నాలుగు దశలలో ఎన్నికలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. 1024 పంచయతీ సర్పంచ్ లకు, 6,708 వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమ వారం పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ తో కలసి మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నాలుగు విడతలలో సగటున 78.02 శాతం పోలింగు జరిగిందని, మూడు, నాలుగు దశలలో ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారని సంతోషం వ్యక్తం చేసారు. మునిసిపల్ ఎన్నికలలో సైతరం అందరూ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సిబ్బందికి చక్కటి శిక్షణా కార్యక్రమం చేపట్టడం, అన్ని ఏర్పాట్లు సమయానుసారం పక్కాగా నిర్వహించడం వంటి కార్యక్రమాల వలన ఎన్నికలు సజావుగా నిర్వహించడం జరిగిందని వివరించారు. రెండు, మూడు చోట్ల కొద్దిగా ఉద్రిక్త వాతావరణం మినహా ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. ఎన్నికలలో అసభ్య, అసాంఘిక ప్రవర్తనకు కఠిన చర్యలు : ఎన్నికలలో రెచ్చ గొట్టే చర్యలు, దాడులు వంటి అసభ్య, అసాంఘిక కార్యక్రమాలకు దిగేవారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. బేలెట్ పేపర్, బేలెట్ బాక్సు ఎత్తుకు పోవడం, కాల్చివేయడం వంటి సంఘటనలకు పాల్పడే వారికి ఐదు సంవత్సరాల కనీస జైలు శిక్ష పడుతుందని అన్నారు. పోటీలో ఉన్న అభ్యర్ధులు లేదా ఏ ఇతర వ్యక్తి అయినా ఇటువంటి కార్యక్రమాలు చేపడితే ఆరు సంవత్సరాల వరకు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధం విధించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేసారు. అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలను ఇబ్బందులపాలు చేసే ఏ ఒక్క అంశాన్ని చేపట్టరాదని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికలలో కొన్ని ప్రాంతాల్లో ఓట్లు వేసే సమయంలోనూ ముఖ్యంగా ఓట్ల లెక్కింపు సమయంలో అవగాహన లేని వ్యక్తులు దుష్ప్రచారాలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మునిసిపల్ ఎన్నికలలో సైతం ఇదే తరహా పర్యవేక్షణ పటిష్టంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మునిసిపల్ ఎన్నికలకు ప్రవర్తనా నియమావళి అమలు : మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళి ఇప్పటికే అమలులో ఉందని జిల్లా కలెక్టర్ నివాస్ అన్నారు. మునిసిపల్ షెడ్యూల్ పై సంబంధిత మునిసిపల్ అధికారులు రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి వివరాలు అందిస్తారని చెప్పారు. మునిసిపల్ ఎన్నికలలో గతంలో నామినేషన వేసిన వ్యక్తులు మరణించి ఉంటే అటువంటి చోట్ల నామినేషన్లు వేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించిందని కలెక్టర్ చెప్పారు. ఫారం – ఏ, ఫారం – బి మార్పుకు అవకాశం ఉందని తెలిపారు. 2020 మార్చి 3వ తేదీ నాటికి ఉన్న ఓటర్ల జాబితాను అనుసరించి మునిసిపల్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు.