మున్సిపల్ ఎన్నికలకు సిద్దంగా ఉండాలి..
Ens Balu
3
Visakhapatnam
2021-02-22 19:41:43
ఆంధ్రప్రదేశ్ లో మార్చి నెలలో జరగబోయే మున్సిపల్స్ ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం ఆయా మున్సిపాలిటీలు/మున్సిపల్ ఎన్నికలపై చేస్తున్న ఏర్పాట్లుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి తో కలసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ, ఆయా మున్సిపాలిటీలలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తగు చర్యలు చేపట్టాలని, నిబంధనలను తూ. చ. తప్పకుండా పాటిస్తూ ఎప్పటికప్ప్పుడు నియమావళికి అనుగుణంగా తగు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికలలో పోటీ చేయడానికి ఇదివరకే నామినేషన్లు వేసి చనిపోయిన అభ్యర్ధులకు బదులుగా ఈ నెల 28వ తేదిన ఇతరుల వద్ద నుండి నామినేనషన్లను రిటర్నింగు అధికారులు స్వీకరించడానికి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికలు పగద్బందీగా నిర్వహించుటకు గాను, ఏమైనా సందేహాలు ఉంటే, వాటిని నివృత్తి చేసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల అధికారులతో నిరంతరం చర్చించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విశాఖపట్నం ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్, విశాఖ జిల్లా కలక్టరు వి. వినయ్ చంద్, సిటీ పోలీసు కమిషనర్ మనీస్ కుమార్ సిన్హా, జివిఎంసి కమిషనర్ నాగలక్ష్మి ఎస్., జివిఎంసి ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.