పరిశోధనా ఫలితాలు రైతులకు చేరాలి..
Ens Balu
3
Srikakulam
2021-02-23 14:57:08
వ్యవసాయ రంగంలో చేస్తున్న పరిశోధనల ఫలితాలు రైతులకు చేరాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనా సంస్ధలో మంగళ వారం జరిగిన కిసాన్ మేళాలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు పరిశోధనా ఫలితాలు అందాలని, తరగతి గదుల నుండి క్షేత్ర స్ధాయికి ఫలితాలు చేరినప్పుడు మాత్రమే సార్ధకత ఉంటుందని పేర్కొన్నారు. పరిశోధనలు రైతులకు ఆదాయం తెచ్చే విధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేసారు. రైతులకు మంచి సూచనలు అందిస్తే దానిని పాటిస్తారని ఆయన అన్నారు. జిల్లాలో 1010 రకం వరి విత్తనాలను మార్పు చేయాలని నిషేధించి 1075 రకం విత్తనాలను సరఫరా చేసి రైతులకు అవగాహన కలిగించడంతో వారు మద్ధతు ఇచ్చారని చెప్పారు. అదేవిధంగా 1075 రకం విత్తనాల స్ధానంలో 1121 విత్తనాలను వేసుకోవాలని కోరితే దానిని అంగీకరించారని పేర్కొన్నారు. ఖరీఫ్ పంటలో రైతులు ఏ అంశాల్లో మోసపోతున్నారో గ్రహించామని అందుకు అనుగుణంగా ధాన్యం సేకరణను చేపట్టామని చెప్పారు. రవాణా ఛార్జీలు రైతుల ఖాతాలలోకి వేసామని, తద్వారా రైతుకు 2 నుండి 3 వేల రూపాయలు ఆదాయం లభించిందని అన్నారు. రబీలో కూడా రైతుకు ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ సమయంలో తూకంలో సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పంట పూర్తి అయిన తరువాత పొలంలో పచ్చి రొట్ట విత్తనాలకు గాను పొలం పచ్చగా ఉండేందుకు రైతులు చర్యలు చేపట్టాలని, అనంతరం దానిని దున్నాలని పిలుపునిచ్చారు. తద్వారా సేంద్రియ ఎరువు తయారు కాగలదని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి విధానాలను పాటించి లబ్దిపొందాలని కోరారు. నాణ్యమైన, తినడానికి ఉపయోగపడే పంటలను శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే పండించడం జరుగుతుందని, ఇతర ప్రాంతాల్లో వాణిజ్యపరంగా పంటలు పండిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ లో 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే విత్తనాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించగా అంగీకరించిందని, ఆ మేరకు ప్రతి రైతుకు విత్తనాలు అందించామని చెప్పారు. విత్తనాలను 50 శాతం సబ్సిడితో పంపిణీ చేసామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఖరీఫ్ లో సైతం ప్రతి రైతుకు ఎరువులు కూడా అందేవిధంగా చర్యలు చేపడతామని ఆయన అన్నారు.
పాడి పశువులను వృద్ధి చేయండి – అదనపు ఆదాయం పొందండి : రైతులు వ్యవసాయం మాత్రమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలపైనా దృష్టి సారించాలని కలెక్టర్ నివాస్ కోరారు. కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఆవులు, గేదెలు కలిగిన రైతులు అమూల్ సంస్ధతో అనుసంధానం అవుతున్నారని చెప్పారు. అమూల్ సంస్ధకు పాలు పోయడం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారని తెలిపారు. నాణ్యతకు అనుగుణంగా లీటరుకు రూ.70 వరకు ధర ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారని చెప్పారు. నాలుగైదు ఆవులు, గేదెలు ఉన్న మహిళలు అదనంగా రూ.21 వేల ఆదాయం పొందుతున్నట్లు గణాంకాలు ఉన్నాయని తెలిపారు. రైతులు అమూల్ సంస్ధతో అనుసంధానమై పాలు సరఫరా చేయడం వలన ఆదాయం వస్తుందని అన్నారు. చేయూత పథకం క్రింద మహిళలకు ప్రభుత్వం అందించిన ఆర్ధిక సహాయంతో ఆవులు, గేదెలు, మేకలు వంటి పశుసంపద వృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ కంటే శ్రీకాకుళంలో మాంసం కిలో ధర అధికంగా ఉందని తెలియవచ్చిందని, అందుకు కారణం మేకలు, గొర్రెల లభ్యత తక్కువగా ఉందని చెప్పారు. మేకలు, గొర్రెలు పెంపకం ద్వారా ఆదాయం పొంచుకోవచ్చని ఆయన సూచించారు. అపరాలు, చిరుధాన్యాలు పండించడం ద్వారా కూడా అదనపు ఆదాయం హెచ్చింపు చేసుకోవచ్చని అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో అపారమైన అనుభవం ఉన్న రైతులు ఉన్నారని, వ్యవసాయ రంగంలో వారి పరిజ్ఞానం ముందు మా పరిజ్ఞానం చాలా తక్కువగా బావిస్తున్నామని వారందరికి సెల్యూట్ అని అన్నారు.
ఈ సందర్భంగా వివిధ పంటలలో చీడపురుగుల నివారణ, పంటల విస్తరణ తదితర అంశాలపై రూపొందించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ నివాస్ ఆవిష్కరించారు. గోగు పంటను గత 30 సంవత్సరాలుగా సాగు చేస్తున్న ఓ.వి.పేటకు చెందిన బుడుమూరు సూర్యారావు, సలికాంకు చెందిన మంగరాజు గురుగు నాయుడును సత్కరించారు. కిసాన్ మేళాలో భాగంగా వ్యవసాయ ఉత్పాదకాలను, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలతో కూడిన ప్రదర్శనలను ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరక్టర్ ఆఫ్ ఎక్స్ టెన్షన్ డా.పి.రాంబాబు, డైరక్టర్ ఆఫ్ రిసెర్చ్ డా.ఎన్.త్రిమూర్తులు, ఆమదాలవలస ఏ.ఆర్.ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డా.టి.శ్రీలత, అనకాపల్లి ఆర్.ఏ.ఆర్.ఎస్ శాస్త్రవేత్త డా.ఎం.భరత లక్ష్మి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా.ఏ.ఈశ్వర రావు, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఏ.శ్రీనివాస రావు, ఉద్యానవన సహాయ సంచాలకులు పి.లక్ష్మిప్రసాద్, ఏపిఎంఐపి ప్రాజెక్టు డైరక్టర్ ఏ.వి.ఎస్.వి.జమదగ్ని, ఏ.ఆర్.ఎస్ శాస్త్ర వేత్తలు డా.డి.చిన్నం నాయుడు, డా.జి.చిట్టిబాబు, డా.కె.భాగ్యలక్ష్మి, డా.పి.అమరజ్యోతి, ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం బోర్డు సభ్యులు డా.ఎస్.వి.ఎస్.ఆర్.కె.నేతాజి, పి.దేవుళ్ళు, పి.భూదేవి, స్వచ్చంద సంస్ధల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.