వాణిజ్య పంటల దిశగా అడుగులు..
Ens Balu
5
Srikakulam
2021-02-23 19:29:05
వాణిజ్య పంటల దిశగా రైతులను కదలించుటకు సన్నాహాలు చేస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. రాజాం మండలం బొద్దాంలో ఉద్యానవన నర్సరీ, రాజాం మండల కేంద్రంలో ఎర్ర చెరువు పనులు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నాడు – నేడు పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు వాణిజ్య పంటల దిశగా అడుగులు వేయుటకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జిల్లా రైతులు దాదాపుగా వరి పంటపై మాత్రమే దృష్టి సారిస్తున్నారని ఆయన చెప్పారు. వరి పంట అనంతరం 6 నుండి 8 నెలల పాటు రైతులు ఖాళీగా ఉంటున్నారని, భూములు ఖాళీగా ఉంటున్నాయని పేర్కొన్నారు. సంవత్సరం పొడుగునా పని ఉండాలని, తద్వారా ఆదాయం రావాలని, రైతు కుటుంబాలు ఆర్ధికంగా ముందంజ వేయాలని ఆయన అన్నారు. ఇందులో భాగంగా భూములు ఖాళీగా ఉండకుండా వాణిజ్య పంటలు వేయుటకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గంటన్నర కాలంలో చేరుకునే పెద్ద నగరం విశాఖపట్నం ఉందని, జిల్లాలో పండిన పంటలను మార్కెటింగు చేయుటకు మంచి అవకాశం ఉందని ఆయన చెప్పారు. సేంద్రియ ఎరువులు ద్వారా పండించిన పంటలకు మంచి డిమాండ్ ఉన్న విషయం అందరికి విదితమేనని ఆయన పేర్కొన్నారు. ఉద్యానవన నర్సరీలో కాప్సికం, కేరట్, బీర, మిరప తదితర పంటలు ఉన్నాయని వీటికి విశాఖపట్నంలో మంచి మార్కెట్ ఉందని చెప్పారు. రైతులకు మంచి ఆదాయం లభించడం, జిల్లా వాణిజ్య పంటలకు నిలయంగా మారడమే ధ్యేయమని నివాస్ అన్నారు.
కోటి రూపాయలతో ఎర్ర చెరువు పనులు : రాజాం బొబ్బిలి జంక్షన్ వద్ద ఉన్న ఎర్ర చెరువు అభివృద్ధి పనులను కోటి రూపాయలతో చేపట్టుటకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ నివాస్ చెప్పారు. గతంలో ఎర్ర చెరువు పనులను వి.ఎం.ఆర్.డి.ఏ చేపట్టుటకు రూ.30 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, ఆ మొత్తానికి అదనంగా 60,70 లక్షల రూపాయలు కలిపి చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయడం వలన రాజాం పర్యాటకంగా మరింత అభివృద్ధి కాగలదని ఆయన పేర్కొన్నారు. చెరువు గట్టుపై వాకింగ్ ట్రాక్, చెరువుకు ఆనుకుని ఉన్న స్ధలంలో మల్టిషాపింగ్ కాంప్లెక్సు, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఓపెన్ జిమ్ నిర్మించుటకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాజాం పట్టణానికి మరింత శోభను ఎర్ర చెరువు చేకూర్చగలదని కలెక్టర్ చెప్పారు. చెరువు గట్టుపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని, అచ్చట ఉన్న పేద కుటుంబాలకు మరో చోట ఇళ్ళను కల్పించే చర్యలు తీసుకోవాలని తహశీల్దారును ఆదేశించారు.
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాడు – నేడు పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ఆహ్లాదకర వాతావరణంలో చిన్నారులు చదువుకొనుటకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. మరుగుదొడ్లలో చేపడుతున్న పనులను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు పి.సుగుణాకర రావు, తహశీల్దారు వేణుగోపాల రావు, ఏపిఎంఐపి ప్రాజెక్టు డైరక్టర్ ఏ.వి.ఎస్.వి.జమదగ్ని, ఉద్యానవన సహాయ సంచాలకులు పి.లక్ష్మిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.