మున్సిపల్ ఎన్నికలు విజయవంతం చేయాలి..


Ens Balu
2
Visakhapatnam
2021-02-23 19:35:49

మహా విశాఖ నగర పాలక సంస్థ,  నర్సీపట్నం, యలమంచిలి పురపాలక సంస్థలకు  మార్చి 10వ తేదీన జరిగే ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు అందరూ కృషి చేయాలని   జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్  ఆదేశించారు.  మంగళవారం జీవీఎంసీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఎన్నికల నియమ, నిబంధనలను   క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నట్లయితే   నిర్వహణ   సులభమవుతుందన్నారు. జిల్లాలో జరిగిన నాలుగు దశల పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలియజేస్తూ, ఆ ఎన్నికలలో పనిచేసిన అధికారుల సేవలను  వినియోగించు కోవాలన్నారు.  జీవీఎంసీలో ఎన్నికలు జరిగి చాలా కాలమైనందున జాయింట్ కలెక్టర్ లను, జోనల్ కమిషనర్లకు సహకరించేందుకు  రెవెన్యూ శాఖకు చెందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నియమించామన్నారు.  శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు, ఎటువంటి లోపాలు రానీయకుండా చూసేందుకు నోడల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు.  అధికారులకు అప్పగించిన విధులను వేగంగా, స్పష్టంగా, నేర్పుతో   చేయాలన్నారు.  ఎన్నికలలో   వందశాతం పక్కాగా పూర్తి చేస్తేనే విజయవంతం అవుతుంది అన్నారు. నగరంలో 98 వార్డులు ఉన్నాయని, 31 మంది  రిటర్నింగ్ అధికార్లు  ఉంటారన్నారు. జోనల్ కమిషనర్లే కీలకంగా వ్యవహరించాలన్నారు. నామినేషన్ల విరమణ, గుర్తుల కేటాయింపు, తుది జాబితా తయారుచేయడం పక్కాగా చేయాలన్నారు. పోలింగ్ సిబ్బందికి సామగ్రిని అందజేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందస్తు చర్యలు  తీసుకోవాలన్నారు.  బ్యాలట్ బాక్సులను, ఓటర్ల జాబితా ఐదు కాపీలు ముందుగా సిద్ధం చేసుకోవాలన్నారు. సెక్రటేరియట్ సిబ్బందిని ఎన్నికలలో ఉపయోగించుకోవచ్చని, వార్డు వాలంటీర్లను మాత్రం వినియోగించరాదన్నారు. పోలింగ్ కేంద్రాలను మూడు పర్యాయాలు పరిశీలన చేయాలని, తాగునీరు మరుగుదొడ్లు మొదలైన మౌలిక వసతులను  కల్పించాలన్నారు. అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాలన్నారు.  పోలింగ్ సిబ్బందికి తగిన శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వివిధ కమిటీల ద్వారా చేసే పనులను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు.  ప్రచార సమయాలను, నియమాలను ఉల్లంఘించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సూక్ష్మ పరిశీలకులు, వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ పక్కాగా ఉండాలన్నారు. పోలింగ్ సిబ్బందికి వాహనాలు, శుభ్రమైన ఆహారం  నామినేషన్ల ప్రక్రియ, ఓటింగ్ సరళి, ఫలితాల వెల్లడిలో ఎటువంటి ఆలస్యం పనికి రాదన్నారు. కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు రిపోర్టులు  పై అధికారులకు అందజేస్తూ ఉండాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పని చేస్తూ ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో   జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్లు పి., అరుణ్ బాబు,  ఆర్ గోవిందరావు,  అడిషనల్ కమిషనర్ లు ఎ.వి.రమణి, పి.ఆశాజ్యోతి, వి.సన్యాసిరావు, డి.ఆర్.డి.ఎ. పి.డి. వి.విశ్వేరరావు, డిఆర్వో ఎ.ప్రసాద్, జిల్లా పంచాయితీ అధికారి వి.కృష్ణ కుమారి, సాంఘిక సంక్షేమ  జె.డి. డి.వి.రమణమూర్తి, జెడ్.పి. సి.ఈ.వో. వి.నాగార్జున సాగర్, ఎస్.డి.సి. సిహెచ్.రంగయ్య, డిఈవో బి.లింగేశ్వరరెడ్డి, సి.ఈ. కె.వెంకటేశ్వరరావు, సిసిపి ఆర్.జె.విద్యుల్లత, డిఐవో వైవికెఎస్ఆర్ మూర్తి, ఆర్టిసీ ఆర్.ఎమ్. ఎమ్.వై.దానం, డిఎంఅండ్ హెచ్ వో డా.పి.సూర్య నారాయణ, జివియంసి సిఎమ్ వో డా.కె.ఎస్. శాస్త్రి, జోనల్ కమిషనర్లు, ఎలమంచిలి నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.