పట్టణాల పరిశుభ్రతకు క్లాప్ అమలు..
Ens Balu
2
Vizianagaram
2021-02-24 19:37:44
పట్టణాల పరిశుభ్రంగా, అందంగా, అహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కొత్తగా రూపొందించిన క్లాప్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. ఈ కార్యక్రమం అమలుపై మున్సిపల్ కమిషనర్లు, టిట్కో ఇంజనీర్లతో తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణాల్లో పరిశుత్రను, పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం కొత్తగా క్లాప్ పేరుతో క్లీన్ ఆంధ్రప్రదేశ్ వంద రోజుల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని రూపొందించిందని చెప్పారు. దీనిలో భాగంగా ప్రతీ ఇంటినుంచి చెత్త సేకరణ, సేకరించిన చెత్తను వేరుచేయడం, సమర్థవంతంగా చెత్త నిర్వహణ, మొక్కల పెంపకం తదితర కార్యక్రమాల ద్వారా పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పట్టణాలను రూపొందించడం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాకు నోడల్ అధికారిగా ఛీఫ్ ఇంజనీర్ గోకర్ణ శాస్త్రిని నియమించినట్లు తెలిపారు. ఈ నోడల్ అధికారులు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించడంతోపాటుగా, రోడ్లను మరమ్మతు చేసి అందంగా తీర్చిదిద్దడం, ప్రతీ ఇంటికీ త్రాగునీటి సరఫరా కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తారని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని, ఈ కార్యక్రమంలో భాగంగా దీనిని మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
టిట్కో ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని టిట్కో లబ్దిదారులనుంచి సుమారుగా 57 కోట్లు, నెల్లిమర్ల నగర పంచాయితీ నుంచి 10 కోట్లు, సాలూరు మున్సిపాల్టీ నుంచి 3 కోట్లు, బొబ్బిలి మున్సిపాలిటీ నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉందన్నారు. లబ్దిదారులనుంచి రావాల్సిన వాటాను వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పురపాలక, పట్టణాభివృద్దిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. క్లాప్ కార్యక్రమం అమలుకు తీసుకున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, టిట్కో ఇఇ శ్రీనివాసరావు పాల్గొన్నారు.