మున్సిపల్ నామినేషన్ కు మరో ఛాన్స్..


Ens Balu
2
Visakhapatnam
2021-02-24 19:54:11

జివిఎంసికి జరగబోయే ఎన్నికలలో ఇప్పటికే నామినేషన్ వేసి మరణించిన వివిధ రాజకీయ పక్షాలకు చెందిన అభ్యర్థులకు బదులు మరొక వ్యక్తితో తిరిగి నామినేషన్ చేయవచ్చునని కమిషనర్ నాగలక్ష్మీ సెల్వరాజన్ పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. అభ్యర్ధులు  ఈనెల 28వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు సంబంధిత రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్ దాఖలు చేయవచ్చునన్నారు. దానికోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నూతనంగా ఆదేశాలు జారీ చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికనుగుణంగా జివిఎంసి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తరపున పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించే నిమిత్తము ఫారం - “ఎ” & ఫారం – “బి” లను ఆయా రాజకీయ పక్షాలు సమర్పించవలసిన తేదీలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిందన్నారు. ఫారం – “ఎ”  పత్రాన్ని సంబందిత  రాజకీయ పక్షాలు  తరపున ఈనెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు విశాఖపట్నం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ వారికి ఆయా రాజకీయ పక్షాల అధ్యక్షులు, జనరల్ కార్యదర్శి మొదలగు  వారు సమర్పించాలన్నారు. అదేవిధంగా ఫారం – “బి” ని మార్చి 3వ తేదీ 3 గంటల లోపు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు అందించాలని రాష్ట్రంలో గల అన్ని రాజకీయ పక్షాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలియజేసిందన్నారు. ఈ విషయమును గమనించి, నిర్ణీత సమయంలో  ఫారం - “ఎ” , ఫారం –“బి” లను సంబంధిత అధారిటీ వారికి అందించవలసిందిగా జివిఎంసి కమిషనర్  అన్ని రాజకీయ పక్షాల వారిని కోరుతున్నామన్నారు.