పనుల అంచనాలు సమర్పించాలి..
Ens Balu
3
శ్రీకాకుళం
2021-02-25 21:04:05
శ్రీకాకుళం జిల్లాలో తాగునీటి వసతుల పనుల అంచనాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్.డబ్ల్యు ఎస్ పనులపై జిల్లా కలెక్టర్ నివాస్ గురువారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రానున్న వేసవి దృష్ట్యా పనులలో వేగం పెంచాలని ఆయన ఆదేశించారు. వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. తాగునీటి సమస్య వచ్చే గ్రామాలను ముందుగా గుర్తించి నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇంటింటికి కొళాయి కనెక్షన్లను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని స్పష్టం చేసారు. శత శాతం గృహాలకు కనెక్షన్లు అందాలని అన్నారు. కొత్త పనుల అంచనాలు తక్షణం చేపట్టాలని ఆదేశించారు. పెండింగులో ఉన్న పనుల అంచనాలు మార్చి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పనులను వ్యక్తిగతంగా ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని ఆయన స్పష్టం చేసారు. రేగిడి ఆమదాలవలసలో 61 పనులకు ఒక పనికి మాత్రమే అంచనాలు తయారు చేయడంపై ప్రశ్నించారు. శ్రీకాకుళం ఏఇ అంచనాలు సమర్పించడంలో శ్రద్ధ వహించారని అభినందించారు. 289 పనులకు రూ.26 కోట్లతో అంచనాలు తయారు చేశారని అయితే పనులు పూర్తి చేయడంలో జాప్యం కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. జగనన్న కాలనీల్లో తాగునీటి వసతుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఎచ్చెర్ల, టెక్కలి మండలాల్లోని కాలనీల్లో పనులు బాగా చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్.డబ్ల్యు ఎస్ ఎస్.ఇ టి. శ్రీనివాసరావు, ఇఇలు, డిఇఇలు తదితరులు పాల్గొన్నారు.