జోనల్ అధికారుల పాత్ర కీలకం..
Ens Balu
2
విజయనగరం
2021-02-25 21:16:57
మున్సిపల్ ఎన్నికల్లో జోనల్ అధికారుల పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అన్నారు. వీరంతా బాధ్యతతో, సమర్థవంతంగా విధులను నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జోనల్ అధికారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జోనల్ అధికారుల వ్యవహార సామర్థ్యంపైనే ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉంటుందన్నారు. ఆర్ఓలు, పిఓలు, ఇతర ఎన్నికల అధికారులు, సిబ్బందిని సమన్వయ పరిచే బాధ్యత జోనల్ అధికారుల ముఖ్య విధి అని అన్నారు. ఎన్నికల ముందురోజు సిబ్బంది అంతా హాజరైనదీ, వారికి అవసరమైన సామగ్రి అందినదీ లేనిదీ పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల రోజు తమ పరిధిలోని ప్రతీ పోలింగ్ స్టేషన్‌ను జోనల్ అధికారులు కనీసం రెండుసార్లైనా పరిశీలించాలని చెప్పారు. జెడ్ఓలు పోలింగ్ స్టేషన్లను ఎంత ఎక్కువగా సందర్శిస్తే, అంత సజావుగా ఎన్నిక జరుగుతుందని సూచించారు. ఓటింగ్ ఎక్కువగా జరిగేలా చూడటం, నిర్ణీత సమాయానికి పోలింగ్ ప్రారంభించడంతో పాటు, సకాలంలో ముగిసిలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సక్రమంగా అందించే బాధ్యతను జోనల్ అధికారులు నిర్వర్తించాలని సూచించారు. జోనల్ అధికారుల హాజరును, వారి సన్నద్దతను కలెక్టర్ పరిశీలించారు.
జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయని, కాబట్టి ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, దానిని తట్టుకొనే విధంగా జోనల్ అధికారులు ముందే సంసిద్ధులు కావాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. తమ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లను ముందుగానే పరిశీలించి, లోటుపాట్లను సరిచేయాలన్నారు. పంచాయితీ ఎన్నికలకు భిన్నంగా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మరింత అప్రమత్తంగా విధులను నిర్వహించాలని కోరారు. జోనల్ అధికారుల బాధ్యతలు, నిర్వర్తించాల్సిన విధులను ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ ఎస్.అప్పలనాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జిసిహెచ్ కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్(వెల్ఫేర్) జె.వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.