విశాఖలో క్లాప్ ను విజయవంతం చేయాలి..
Ens Balu
2
Visakhapatnam
2021-02-25 22:19:23
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వందరోజుల క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) ప్రణాళిక క్రింద జివిఎంసి పరిధిలో చేపట్టే పలు పనులను శ్రద్ధతో నిర్వహించి విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఎం.ఎ.&యు.డి. ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, జివిఎంసి అధికారులను ఆదేశించారు. గురువారం, జివిఎంసి సమావేశ మందిరంలో కార్పొరేషన్ కమిషనర్ నాగలక్ష్మి ఎస్., వి.ఎం.ఆర్.డి.ఎ. కమిషనర్ కోటేశ్వరావులతో కలిసి క్లాప్ పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జివిఎంసి పరిధిలో సోలిడ్ వేస్ట్ పునర్వినియోగం కింద చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల అమలు తీరును ప్రధాన ఇంజినీరును, చీఫ్ మెడికల్ అధికారిని అడిగి తెలుసుకుని, పలు సూచనలు ఇచ్చారు. కార్పొరేషన్ పరిధిలో గృహం వద్ద చెత్తను వేరు చేసి వాహనాలకు అందించే విధంగా తగు చర్యలు చేపట్టాలని ఇందుకు గాను 100 రోజుల వ్యవధిలో ప్రజలకు అవగాహన నిరంతరం కల్పించాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. ప్రజారోగ్య విభాగంలో నడుపుతున్న వాహనములకు ట్రాకింగ్ సిస్టం యాప్ ద్వారా గుర్తించే విధంగా ఇండోర్ కార్పొరేషన్ మోడల్ ను అనుసరించాలని అదనపు కమిషనర్ కు సూచించారు. నగరంలో చెత్తను తరలించే ట్రాన్స్ఫర్ స్టేషన్లు పెంచాలని కమిషనర్ కు సూచించారు. కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ లో బయో మైనింగ్ ప్రాసెస్ ద్వారా ఖాళీ అయిన స్థలంలో సుందరమైన పార్కు అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. నగరంలో గల కార్పొరేషన్ కు చెందిన స్థలాల్లో వాణిజ్య అవసరాలకు అనుగుణంగా భవనాలను నిర్మించి జివిఎంసి రెవెన్యూ పెంపుకు కృషి చేయాలని కమిషనర్ కు సూచించారు.
కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న పలు వినూత్న పద్ధతులకు మద్దతు తెలుపుతూ, ఇటువంటి పద్ధతులు రాష్ట్రంలో ఇతర కార్పొరేషన్లు/మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. నగరంలో అమలులో గల భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా పథకాలు అమలు తీరును ప్రధాన ఇంజినీరును, పర్యవేక్షక ఇంజనీరును అడిగి తెలుసుకున్నారు. మురుగు నీటి శుద్ధి కేంద్రాలను మరింత అభివృద్ధి చేసి, వాటి నుండి వచ్చిన నీటిని వాణిజ్యపరంగా వినియోగించి, రెవెన్యూ పెంపుకు కృషి చేయాలని కమిషనర్ కు సూచించారు. కమిషనర్ నాగలక్ష్మి ఎస్. మాట్లాడుతూ, కార్పోరేషన్లో చేపడుతున్న పలు అభివృద్ధి పనులు గురించి ముఖ్యకార్యదర్శి కి వివరించారు.
ఈ సమావేశంలో వ.ఎం.ఆర్.డి.ఎ అదనపు కమిషనర్ డా. మనజిర్ జిలానీ సామూన్, మున్సిపల్ పరిపాలనా శాఖ రీజనల్ డైరెక్టర్ కె. రమేష్, జివిఎంసి కి చెందిన అదనపు కమిషనర్లు, ప్రధాన ఇంజనీర్, చీఫ్ సిటీ ప్లానర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, పి.డి.(యు.సి.డి), జె.డి.(అమృత్), ఎఫ్.ఎ.&ఎ.ఓ, కార్యదర్శి, పర్యవేక్షక ఇంజినీరులు, ఎ.ఎమ్.ఓ.హెచ్ లు, వివిధ విభాగపు ఇంజనీరింగ్ అధికారులు, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.