మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి..


Ens Balu
1
Anantapur
2021-02-26 16:11:16

అనంతపురం జిల్లాలో  మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో మున్సిపల్ ఎన్నికలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిర్భయంగా నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ కండక్ట్ అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, సజావుగా ఎన్నికలు నిర్వహించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఓటర్ స్లిప్పుల ప్రింటింగ్ పూర్తి చేసి మార్చి 8వ తేదీ లోపు పూర్తిగా స్లిప్పులు పంపిణీ చేయాలన్నారు. ఎన్నికల కోసం స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ల, వీడియో సర్వైలెన్స్ టీమ్స్ ఏర్పాటు, వెబ్ క్యాస్టింగ్, ఈఓ, ఏఈఓ లకు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి అందుకు సంబంధించిన రిపోర్టులను ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించుకొని దాని ప్రకారం అన్ని పనులు పూర్తి చేసేలా చూడాలన్నారు. ఎన్నికల్లో ఉత్పన్నమయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి అందుకు తగిన విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.  అత్యధికంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలి :  మున్సిపల్ మరియు లోకల్ బాడీ ఎన్నికలలో అత్యధికంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించి అన్ని మునిసిపాలిటీలలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఆటోల ద్వారా ప్రచారం చేయాలని, ఎన్జీవోలు, షాపు యజమానుల ద్వారా ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే మున్సిపాలిటీల పరిధిలోని పాఠశాలలలో విద్యార్థులకు ఓటు ప్రాధాన్యం తెలియజేసి వారి తల్లిదండ్రులు ఓటింగ్లో పాల్గొనేలా అవగాహన కల్పించాలని, మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లకు వచ్చే వృద్ధులు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల్లో మద్యం, డబ్బు రవాణా కాకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేసేలా ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. సజావుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు.  సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, ఏ. సిరి, గంగాధర్ గౌడ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ నాగరాజు, నగరపాలక సంస్థ కమిషనర్ పి వి ఎన్ ఎన్ మూర్తి, డిప్యూటీ కలెక్టర్ నిశాంత్, రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కుమారీశ్వరన్, తదితరులు పాల్గొన్నారు.