సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి..
Ens Balu
3
Srikakulam
2021-02-26 19:23:40
శ్రీకాకుళం జిల్లాలో చైల్డ్ కేర్ కేంద్రాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. జిల్లా బాలల రక్షణ కమిటీ సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రదేశాల్లో రక్షించిన బాలలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. చిన్నారుల విద్యా పరిస్థితులు, హాజరు తదితర అంశాలను తరచూ పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. అవసరాలు ఉన్న చిన్నారులకు ఏ సమయంలో నైనా పూర్తి సహకారాన్ని అందించాలని స్పష్టం చేసారు. చైల్డ్ కేర్ కేంద్రాలు పక్కాగా నిర్వహించాలని, నిర్దేశించిన ప్రామాణికాలు విధిగా పాటించాలని ఆయన పేర్కొన్నారు. చిన్నారుల అంశం సున్నితమైనదని, ఎటువంటి తప్పులు లేకుండా కేంద్రాలు పనిచేయాలని స్పష్టం చేసారు. కేంద్రాలు వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వచ్చి వెళ్ళేవారిపై పర్యవేక్షణ అవసరమని అన్నారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేయని చైల్డ్ కేర్ కేంద్రాలను కొనసాగింపుకు అనుమతించమని ఆయన స్పష్టం చేసారు. ప్రతి చిన్నారికి ఆరోగ్య పరీక్షలు తరుచూ నిర్వహించాలని అన్నారు. అన్ని రిజిస్టర్ లు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. రక్షించిన పిల్లల భవిష్యత్తుకు మంచి పునాదులు వేయాలని కలెక్టర్ అన్నారు. 1098 సేవలు ద్వారా తీసుకువచ్చిన చిన్నారులను విధిగా మహిళా ప్రాంగణంలోకి చేర్చుకోవాలని ఆయన స్పష్టం చేసారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తే చర్యలు చేపడతామని హెచ్చరించారు. రవాణా సదుపాయాలు కల్పించడంలో జాప్యం ఉండరాదని ఆయన తెలిపారు. స్టేట్ హోమ్ లో సామర్ధ్యం పెంచాలని ఆయన ఆదేశించారు.
జువెనైల్ కోర్టు ప్రధాన జడ్జి కె.రాణి మాట్లాడుతూ చిన్నారులకు చక్కని సలహాలు, సూచనలు ఇవ్వాలని, తద్వారా పాజిటివ్ దృక్పధం కలిగి ఉండగలరని అన్నారు. అటువంటి వాతావరణం కల్పించాలని సూచించారు. మంచి చెడులను విశదీకరించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని పేర్కొన్నారు. జిల్లా బాలల రక్షణ అధికారి కె.వి.రమణ కార్యక్రమాన్ని గురించి వివరిస్తూ 18 సంవత్సరాలలోపు వయస్సు గల బాలబాలికల రక్షణ ఇందులోకి వస్తుందన్నారు. జిల్లాలో 398 కేసులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు కాగా 18 వాటికి శిక్షపడిందని చెప్పారు. 60 విచారణలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ వీరావల్ వంటి ప్రాంతాలకు వెళుతున్న చిన్నారులు ప్రమాదకర పరిస్థితులలో పనిచేస్తున్నట్లు వాటితో ముఖాముఖి మాట్లాడినప్పుడు తెలిసిందని చెప్పారు. జిల్లాలో 517 గ్రామ స్థాయి కమిటీలు, 11 పట్టణ స్థాయి కమిటీలు, 11 మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో 20 చైల్డ్ కేర్ కేంద్రాలు ఉన్నాయని, మొత్తం 315 మంది చిన్నారులు ఉన్నారని వివరించారు. చిన్నారులకు ఆధార్ చేయించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా కె.శ్రీనివాసులు, అదనపు ఎస్పీ పి.సోమశేఖర్, సి.డబ్ల్యు.సి ఛైర్మన్ జి.నరసింహ మూర్తి, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, అదనపు డి.ఎం.హెచ్.ఓ డా.బి.జగన్నాథ రావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి వెంకట రత్నం, జిల్లా బిసి సంక్షేమ అధికారి కె.కె.కృత్తిక, కార్మిక శాఖ సహాయ కమీషనర్ సిహెచ్ పురుషోత్తం, బాలల పరీక్షణ అధికారి ఓ.వి.ఎల్.సత్యనారాయణరావు, కార్యాలయ సిబ్బంది డి.మధుర మీనాక్షి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.