2రోజుల ముందునుంచే మద్యం బంద్..
Ens Balu
2
Vizianagaram
2021-02-26 21:01:45
విజయనగరం జిల్లాలో మార్చి 10వ తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డ్రై డేస్ ప్రకటిస్తూ కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు జరిగే విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలు మరియు నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో 48 గంటల ముందుగానే మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని పేర్కొన్నారు. ఎన్నిక జరిగే ఆయా ప్రాంతాలకు 5 కి.మీ. సమీపం వరకు ఈ నిబంధలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం మార్చి 8వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5.00 వరకు ఆయా ప్రాంతాల్లో మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలన్నారు. ఫలితాల వెల్లడి రోజు అనగా మార్చి 14వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేంత వరకు పైన పేర్కొన్న నిబంధనల మేరకు రోజంతా మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నిక నిర్వహించేందుకే డ్రై డేస్ ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.