నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ..
Ens Balu
3
Vizianagaram
2021-02-27 13:23:51
ఎన్నికల విధులను నిర్వహించే అధికారులు నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా, తటష్టంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కోరారు. వీరి ప్రవర్తనపైనే ఎన్నిక ప్రక్రియ ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే పిఓలు, ఏపిఓలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణా కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల అధికారులకు సత్ప్రవర్తన, సమయ పాలన చాలా ముఖ్యమన్నారు. పిఓలు తోటి సిబ్బందిని కలుపుకొని సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. నిర్ణీత సమాయానికి ఖచ్చితంగా పోలింగ్ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఓట్లేయడానికి వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందీ కలగని విధంగా పోలింగ్ కేంద్రాలను సిద్దం చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వేగంగా ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకోవడం ద్వారా అత్యధికశాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంటుందని సూచించారు.
కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కోవిడ్-19 రెండోదశ మొదలయ్యిందని, అందువల్ల ప్రతీఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతీఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. ఎన్నికల సిబ్బందికి ఫేస్ షీల్డులు, మాస్కులు, శానిటైజర్లను సరఫరా చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ ఏజెంట్లకు కూడా ఈ సారి మాస్కులను సరఫరా చేస్తామని కలెక్టర్ చెప్పారు.
ఎన్నికల్లో పిఓలు, ఏపిఓలు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలను ఎలక్షన్స్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్, జిల్లా సహకార అధికారి ఎస్.అప్పలనాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.