ఎన్నికల నియమావళి పాటించాల్సిందే..
Ens Balu
1
Kakinada
2021-02-27 13:25:17
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అభ్యర్థులు తు.చ. తప్పకుండా అనుసరించాలని ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి (ఏఆర్‌వో), తూర్పుగోదావరి డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు స్పష్టం చేశారు. శనివారం కాకినాడలో కలెక్టరేట్‌లోని కోర్టుహాల్‌లో ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు, వారి ప్రతినిధులతో సీహెచ్ సత్తిబాబు సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రచారం, ఎన్నికల ఏజెంట్లు, వివిధ రకాల ఫారాలు, బ్యాలెట్ పేపర్లు తదితరాలపై అవగాహన కల్పించారు. ఫొటో గుర్తింపు కార్డులు, ఎన్నికలపై ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలను అభ్యర్థులకు అందించారు. ఈ సందర్భంగా ఏఆర్‌వో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను శాంతియుత వాతావరణంలో విజయవంతంగా పూర్తిచేసేందుకు అభ్యర్థులు సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పర్యవేక్షణకు కలెక్టరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని, ఈ విభాగానికి నోడల్ అధికారిని నియమించామన్నారు. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే లౌడ్‌స్పీకర్లకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. వాహనాల వినియోగానికి రిటర్నింగ్ అధికారి/జిల్లా ఎన్నికల అధికారి అనుమతులు ఇస్తారని, అదే విధంగా సమావేశాలు, ర్యాలీలకు పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు. స్థలం, సమయానికి సంబంధించి కచ్చితమైన సమాచారం అందించాలన్నారు. కరపత్రాలు వంటి వాటిని ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు లేదా సమస్యలను అబ్జర్వర్/రిటర్నింగ్ అధికారి/జోనల్/సెక్టార్ మేజిస్ట్రేట్/భారత ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని ఏఆర్‌వో వివరించారు.