రాజీమార్గమే ఉత్తమమైన రాజమార్గం..


Ens Balu
3
Srikakulam
2021-02-27 15:57:13

ఇరువర్గాల రాజీమార్గం ద్వారా కేసులు సత్కర పరిష్కారమవుతాయని రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం ఉదయం జిల్లా కోర్టుల ప్రాంగణంలో వర్చువల్ లోక్ అదాలత్ కార్యక్రమం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సాదారణంగా  కేసుల కొరకు లక్షలలో లాయర్ ఫీజులతో పాటు కోర్టులకు రావడం వలన దినసరి కూలీని కూడా కోల్పోవడం జరుగుతుందని  అన్నారు. ముఖ్యంగా పొలాలు, ఆస్తి తగాదాలు విషయంలో లక్షల రూపాయలు కోర్టు ఖర్చులు  క్రింద ఖర్చుచేయవలసి వస్తుందని అన్నారు. మరికొన్ని చిన్నకేసులు అయినప్పటికీ తీర్పు వచ్చేందుకు చాలా సమయం పడుతుందని, కాని ఇరువర్గాల రాజీమార్గంతో తక్షణమే కేసులకు పరిష్కారమవుతాయని స్పష్టం చేసారు.  దీనివలన ఇరువర్గాల వారికి సమన్యాయంతో పాటు సమయం, ధనం వృధా కాబోదని, ఈ విషయాన్ని కక్షిదారులు గుర్తెరగాలని ఆయన చెప్పారు. ఇటువంటి కేసులలో అసలు లబ్ధిదారులు మానసిక వేదనకు గురి అవుతుంటారని చెప్పారు. కాబట్టి న్యాయం కోసం కోర్టులకు వచ్చేవారికి సత్వర న్యాయం చేయడంలో కోర్టులు త్వరితగతిన మూలాలు కనుక్కుని న్యాయం చేసే దిశగా ప్రయత్నించాలని చెప్పారు. ప్రతీ కేసు విషయంలో ఇరుపార్టీలు తమలోని ఇగోలను విడిచి స్నేహాభావంతో, సత్సంబంధాలు పెంపొందించుకోవడానికి ఒక మంచి ఆలోచన చేసుకోవాలని, ఆ ఆలోచనే  రాజీ మార్గమని స్పష్టం చేసారు. కాబట్టి ప్రతీ కక్షిదారుడు సత్వర కేసుల రాజీ కొరకు లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కక్షిదారులను కోరారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శిష్టు రమేష్ మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలతో కేసులు పెట్టుకుని కోర్టుల వెంట తిరుగుతూ సమయాన్ని, ధనాన్ని వృధాచేసుకోకుండా కేసుల సత్వర పరిష్కారం కోసం  లోక్ అదాలత్ వినియోగించు కోవాలని చెప్పారు. అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విఠలేశ్వరరావు మాట్లాడుతూ చిన్న,చిన్న సివిల్ కేసుల కోసం నెలల కొలది పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి కంటే సత్వరన్యాయం కొరకు లోక్ అదాలత్ ను ఆశ్రయించడం మేలని ఆయన చెప్పారు. కక్షిదారుల సౌకర్యార్ధం భారత, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలు తెచ్చిన సులువైన మార్గం లోక్ అదాలత్ అని, కాబట్టి ప్రతీ కక్షిదారుడు  ఈ అవకాశాన్ని సద్వినినియోగం చేసుకొని కేసుల నుండి విముక్తి పొంది సుఖమయ జీవితాలు గడపాలని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి మాట్లాడుతూ ఎటువంటి వివాదాలు, వివాహ, భూతగాదా, దొమ్మి లాంటి కేసుల్లో అధిక ధనంతో పాటు సమయం కూడా వృధా అవుతుందని అన్నారు. కాని ఇరువర్గాల రాజీమార్గం వలన కేసులకు సత్కర పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. కావున ఇరుపక్షాల వారు సమన్వయం చేసుకొని రాజీపడేందుకు రాజీమార్గం ఒక మంచి మార్గం అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా జడ్జ్ టి. వెంకటేశ్వర్లు, ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ పి.అన్నపూర్ణ , ప్రిన్సిపాల్ సెక్రటరీ సివిల్ జడ్జ్ కె.నాగమణి, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్.శ్రీలక్ష్మి, ఫస్ట్ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కె. రాణి, ఎక్సైజ్ జడ్జ్ జె.కిషోర్ కుమార్, మొబైల్ కోర్ట్ జడ్జ్ జి.ఎల్.బాబు తదితరులు పాల్గొన్నారు.