సలహా కమిటీ సభ్యునిగా కాండ్రేగుల..
Ens Balu
2
Anakapalle
2021-02-27 16:43:13
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకెఎస్-యువత కార్యక్రమాలు) రాష్ట్ర సలహా కమిటీ సభ్యునిగా కాండ్రేగుల వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వివిధ రంగాలకు చెందిన 48 మంది ప్రతినిధులు ఉంటారు. గడచిన 30 ఏళ్లుగా వినియోగదారుల రక్షణ చట్టం, 15 ఏళ్లుగా సమాచార హక్కు చట్టం అమలు, చట్టాన్ని ఎక్కువ సంఖ్యలో ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యమ వ్యాప్తికి వెంకటరమణ తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా కృషి చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్ధల నుంచి ఇంత వరకు 35 పర్యాయాలు అవార్డులు, ప్రశంసాపత్రాలు ఆయన పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువతను దేశ నిర్మాణ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడం, ఇతర మంత్రిత్వ శాఖల సమన్వయం, సహకారంలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలతో యువత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. విలువలను అభివృద్ధి చేయడం, లౌకిక మార్గాల్లో ఆలోచింపజేయడం, నైపుణ్యం, అభివృద్ధి, ఉత్పాదక, వ్యవస్థీకృత ప్రవర్తనను అవలంభించడానికి యువతకు సహాయపడటం, యువ నాయకత్వం కోసం దీర్ఘకాలిక వ్యూహాలను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. వెంకటరమణ నియామకం పట్ల వినియోగదారుల చట్టం, సమాచార హక్కు చట్టం ఉద్యమకర్తలు హర్షం వ్యక్తం చేశారు.