పట్ణణ ప్రాంతాల్లో 88 శాతం పంపిణీ..
Ens Balu
4
Kakinada
2021-02-27 19:47:47
తూర్పుగోదావరి జిల్లాలో మైబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (ఎండీయూ) ద్వారా పట్టణ ప్రాంతాల్లో 88 శాతం మేర ఇంటింటికీ రేషన్ పంపిణీ జరిగినట్లు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశ మందిరంలో సంచార వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమంపై జాయింట్ కలెక్టర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నెలలో 20 రోజుల పాటు పంపిణీ జరుగుతుందని.. మొదటగా పట్టణ ప్రాంతాల్లో పంపిణీ మొదలైందని తెలిపారు. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కార్యక్రమం ప్రారంభం కాగా.. శనివారం మధ్యాహ్నానికి 58 శాతం మేర పంపిణీ పూర్తయిందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియలో ఎదురైన సమస్యలను విశ్లేషించి, కట్టుదిట్టమైన ప్రణాళికతో పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. మార్చి 1 నుంచి ప్రతి కార్డుదారునికి ఇంటివద్దకే నాణ్యమైన బియ్యం పంపిణీ కూపన్‌ను అందించనున్నట్లు వివరించారు. ఈ కూపన్‌లో ఇంటివద్దకు వాహనం వచ్చే తేదీ, వాహనం ఆపరేటర్ పేరు, మొబైల్ నంబరు తదితర వివరాలు ఉంటాయన్నారు. వాహనం ఇంటివద్దకు వచ్చేటప్పుడు అందుబాటులో లేనివారి కోసం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సరుకులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ప్రారంభంలో చిన్నచిన్న సమస్యలు ఉన్నప్పటికీ, వాటిని సరిదిద్ది 1076 వాహనాల ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కార్డుదారునికీ ఇంటివద్దకే నాణ్యమైన బియ్యం అందుతాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వాహనం కార్డుదారుని ఇంటివద్దకే వస్తుందని, ఎవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో లబ్ధిదారులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వాహనాల ఆపరేటర్లు కూడా సంతోషంగా ఉన్నారని.. శుక్రవారం పట్టణ ప్రాంతాల్లోని ఆపరేటర్ల ఖాతాల్లో రూ.21 వేలు జమయినట్లు పేర్కొన్నారు. రిజైన్ చేసిన వారి స్థానంలో కొత్తవారిని నియమించినట్లు తెలిపారు. సమావేశంలో సివిల్ సప్లయ్స్ డీఎం ఇ.లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు.