కోర్టు కేసులపై అవగాహన పెంచుకోవాలి..


Ens Balu
3
కాకినాడ
2021-02-27 22:28:07

భూ సంబంధిత అంశాలపై హైకోర్టు,ఇతర కోర్టులలో నమోదైన కేసుల పై తహసీల్దార్లు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీ శ అధికారులను ఆదేశించారు.  శనివారం జేసీ నుంచి భూసంబంధిత అంశాలపై వివిధ కోర్టులలో నమోదవుతున్న కేసులపై సబ్ కలెక్టర్లు, అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్లు(ఏజీపి),ప్రభుత్వ ప్లీడర్లు(జీపి),డివిజన్, మండల స్థాయి రెవెన్యూ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ  మాట్లాడుతూ మండల స్థాయి రెవెన్యూ అధికారులకు భూసంబంధిత కేసులపై సరైన అవగాహన లేకపోవడంతో కోర్టులలో కేసులు నమోదు అవుతున్నాయన్నారు.ఈ నేపధ్యంలో తహసీల్దార్లు  భూ సంబంధిత కేసుల పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని ఆయన తెలిపారు.ఆర్ఓఆర్ యాక్ట్ (రికార్డ్ ఆఫ్ రైట్స్), పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ, రెవెన్యూ రికార్డులలో రైతుల పేర్లు మార్పు, తదితర అంశాలపై కొంత మంది తహసీల్దార్లు నిబంధనలు సక్రమంగా పాటించకపోవడం వల్లనే కోర్టులో కేసులు ఎక్కువగా నమోదవుతు అవుతున్నాయన్నారు.ఇక నుంచి క్రమం తప్పకుండా తహసిల్దారులు వారి పరిధిలో నమోదు అయిన హైకోర్టు, జిల్లా ,తాలూకా కోర్టుల కేసుల వివరాలను  ప్రత్యేక రిజిస్టర్ లో నమోదు చేయాలని జేసీ తెలిపారు. సంబంధిత కేసులపై ఏజీపి,జీపిల సమన్వయంతో అఫిడవిట్లు, కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. గౌరవ కోర్టులు వివిధ కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులపై గడువులోపు చర్య తీసుకోవాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకం జారీ,ఆర్ వోఆర్ యాక్ట్ ప్రకారం ఫార్మ్-8 నోటీసులు జారీ చేయడం,చట్ట ప్రకారం గడువు లోపు వచ్చిన అభ్యంతరాలపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఫార్మ్-8 నోటీసులను సంబంధిత గ్రామ సచివాలయంలో ప్రదర్శించాలని జేసీ.. అధికారులకు సూచించారు.  ఈ వీసీ లో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, అమలాపురం, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్లు హిమాన్సు కౌశిక్, అనుపమ అంజలి, ఏజీపిలు, జీపిలు,కలెక్టరేట్ ఏవో జీఎస్ శ్రీనివాస్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.