మహిళా అధికారిణిగా మంచి గుర్తింపు..


Ens Balu
3
శ్రీకాకుళం
2021-02-28 21:19:10

సమాచార పౌర సంబంధాల శాఖలో డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా జిల్లా అధికారుల మన్ననలను పొందడమే కాకుండా  మహిళా అధికారిగా మంచి గుర్తింపును పొందిన వ్యక్తి  పి.లక్ష్మీకాంతం అని జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ కొనియాడారు. డివిజనల్ పి.ఆర్.ఓగా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన లక్ష్మీకాంతం అభినందన సభ కార్యక్రమం డి.పి.ఆర్.ఓ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలకు చెందిన వార్తలను సకాలంలో మీడియా ప్రతినిధులకు అందించడంలో లక్ష్మీకాంతం కీలక పాత్ర పోషించారని చెప్పారు. అలాగే తమకు ఎన్నో సందర్భాలలోనూ,  కార్యక్రమాల నిర్వహణ సమయాల్లో తగు సూచనలు చేసేవారని అన్నారు. ఆమెకు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ జిల్లా అధికారులందరితో మంచి గుర్తింపును తెచ్చుకొన్నారని తెలిపారు. మిగిలిన శాఖలతో పోల్చిచూస్తే సమాచార పౌర సంబంధాల శాఖలో సమయపాలన ఉండదని, కాని అటువంటి విధులను కూడా ఆమె సమర్ధవంతంగా నిర్వహించారని తెలిపారు. ముఖ్యంగా మహిళా అధికారి అయినప్పటికీ కోవిడ్ సమయంలో కూడా తన విధులను సమర్ధంగా నిర్వహించిన సంగతి ఆమె గుర్తుచేసారు. అనంతరం జిల్లా అధికారులతో కలిసి లక్ష్మీకాంతంకు పుష్పమాలను వేసి, దుశ్శాలువ, జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సత్కరించారు.           ఈ అభినందన కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి యల్.రమేష్, విశాఖపట్నం వి.ఎం.ఆర్.డి.ఏ సి.ఏ.ఓ జి.నిర్మలమ్మ, ఐ.సి.డి.ఎస్ ప్రోజెక్టు డైరక్టర్ డా.జి.జయదేవి, సాంఘిక సంక్షేమ గురుకులం సమన్వయ అధికారి వై.యశోద లక్ష్మి, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు వి.పద్మ, ఎస్.టి.ఓ సి.హెచ్.సమతారాణా, అంబేద్కర్ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.పి.సుజాత, ప్రముఖ న్యాయవాది టి.సుధారాణి, విశ్రాంత యస్.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు సిహెచ్.మహాలక్ష్మీ,  రిమ్స్ స్టాఫ్ నర్స్ వి.చిలకమ్మ, అలికాన రాజేశ్వరి , వి.రఘుబాబు, ఐ.నారాయణ రావు, కె.వెంకట సత్యనారాయణ, ఏటిఓలు తవిటయ్య, సావిత్రి, రిమ్స్ స్టాఫ్ నర్స్ టి.పద్మజ తదితరులు పాల్గొని ఆమెకు ఘనంగా సత్కరించారు.