మార్చి 10న మున్సిపాలిటీలకు ఎన్నిక..
Ens Balu
0
Srikakulam
2021-02-28 21:25:53
శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీలకు, పాలకొండ నగర పంచాయతీకి ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. వివిధ విభాగాలకు నోడల్ అధికారులను నియమించామని పేర్కొన్నారు. స్టాటిక్ సర్వేలియన్స్ టీమ్ లను, ప్రవర్తనా నియమావళి అమలు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజాస్వామ్యములో ఓటు వేయడం కీలకమని ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కలెక్టర్ కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వేయడం మన బాధ్యత అని ప్రతి ఓటరు గుర్తించాలని పిలుపునిచ్చారు. మన ఓటు... మన హక్కు... అని, ఓటు అత్యంత శక్తివంతమైనదని తెలుసుకోవాలని ఆయన అన్నారు. మార్చి10వ తేదీన మునిసిపాలిటీలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని పేర్కొంటూ మునిసిపల్ ఎన్నికల్లో సైతం సంబంధించిన ఓటర్లు భారీగా పాల్గొని ఆదర్శంగా నిలవాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల సంఘం వ్యయ పరిమితిని విధించిందని కలెక్టర్ చెప్పారు. ఎన్నికల్లో నామినేషన్ వేసినప్పటి నుండి ప్రతి ఖర్చు లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు మూడు రోజులకు ఒకసారి ఖర్చుల వివరాలు పరిశీలకులకు సమర్పించాలని అన్నారు. అభ్యర్థులు దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇచ్చే ప్రకటనలు కూడా జమ చేయడం జరుగుతుందని స్పష్టం చేసారు. కాగా శ్రీకాకుళం జిల్లాలో మునిసిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులుగా కె.ఆర్.బి.హెచ్.ఎన్. చక్రవర్తి ని నియమించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకునిగా నియమించింది. మార్చి 2వ తేదీ నుండి జిల్లాలో అందుబాటులో ఉంటారు. ఎన్నికలకు సంభందించిన ఫిర్యాదులను 9618138487 ఫోన్ ద్వారా గాను లేదా నేరుగా సమర్పించ వచ్చని పేర్కొన్నారు.