లక్ష్మీకాంతం సేవలు స్పూర్తిదాయకం..


Ens Balu
3
Srikakulam
2021-02-28 21:33:06

సమాచార పౌర సంబంధాల శాఖలో సుధీర్ఘకాలం పాటు పనిచేసి పదవీ విరమణ పొందిన శ్రీకాకుళం డివిజనల్ పౌర సంబంధాల అధికారి పి.లక్ష్మీకాంతం సేవలు స్పూర్తిదాయకమని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వి.మణిరాం కొనియాడారు. జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు, సిబ్బందితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా ఆమె అందరి మన్ననలను చూరగొన్నారని పేర్కొన్నారు. పి.లక్ష్మీకాంతం పదవీ విరమణ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఆదివారం పదవీ విరమణ వీడ్కోలు సభ జరిగింది.  ఈ కార్యక్రమానికి ఆర్.జె.డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాచార పౌర సంబంధాల శాఖలో 34 ఏళ్ల పాటు విధులు నిర్వహించడమే కాకుండా శాఖకు మంచి పేరును తీసుకువచ్చారని చెప్పారు. ఎక్కువ కాలం శ్రీకాకుళం జిల్లాలో పనిచేసారని, విధి నిర్వహణలో మంచి సేవలు అందించడమే కాకుండా సమర్ధవంతంగా పనిచేసిన ఘనత ఆమెకు దక్కుతుందని అన్నారు. ఆమెకు అప్పగించిన ఏ పనినైనా సకాలంలో పూర్తిచేసేవారని, ముఖ్యంగా ఫైలిన్, తితిలీ తుఫాను, కరోనా సమయంలో సమయపాలనతో సంబంధం లేకుండా విధులు నిర్వహించిన సంగతిని ఆయన గుర్తుచేసారు. అంతేకాకుండా ఇటీవల నాలుగు విడతలలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఎప్పటికపుడు సమాచారాన్ని సేకరిస్తూ, మీడియాకు సకాలంలో సమాచారాన్ని అందించడంలో విశేష కృషిచేసారని కొనియాడారు. ఆమె ఒక అధికారి మాత్రమే కాదని, ఒక రచయిత కూడా అని, కవితలు రాయడంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉందని వివరించారు. మూడు జిల్లాల అధికారులు పదవీ విరమణ వీడ్కోలు సభకు హాజరుకావడం ఆమెపై గల గౌరవానికి ప్రతీక అని అభివర్ణించారు. సమాచార శాఖలో పనిచేసే ప్రతీ ఒక్కరూ ఆమెను ఆదర్శంగా తీసుకొని శాఖకు మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు.  తొలుత షష్టి పూర్తి మరియు పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన అనంతరం శ్రీమతి లక్ష్మీకాంతం దంపతులకు పూలమాలను వేసి దుశ్శాలువ, పుష్పగుచ్ఛం, జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు.           విజయనగరం సహాయ సంచాలకులు డి.రమేష్ మాట్లాడుతూ పి.లక్ష్మీకాంతం మంచి అధికారిగా అందరి మన్ననలను చూరగొన్నారని, ఇది ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా భావించాలని చెప్పారు. సమయపాలనతో సంబంధం లేకుండా పనిచేయడం, అధికారుల పట్ల గౌరవం ఉండటం వంటివి సమాచార శాఖలో పనిచేసే ప్రతీ ఒక్కరికి ఉండాలని, ఆ లక్షణాలు అమెకు మెండుగా ఉన్నాయని అన్నారు. ఆమె శాఖకు అందించిన సేవలు సమాచార శాఖలో పనిచేసే ప్రతీ ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. ఆమె అధికారిగా విధులు నిర్వహిస్తూనే కవితలు బాగా రాసేవారని, ప్రతీ తెలుగు సంవత్సర ఉగాది పర్వదినాన ఆమె కవిత తప్పనిసరిగా ఉండేదని గుర్తుచేసారు. విధి నిర్వహణలో ఎటువంటి సమస్యలు లేకుండా 34 ఏళ్ల పాటు సేవలు అందించడం గర్వకారణమని కొనియాడారు.           శ్రీకాకుళం జిల్లా పౌర సంబంధాల అధికారి యల్.రమేష్ మాట్లాడుతూ శాఖకు లక్ష్మీకాంతం అందించిన సేవలు అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. ముఖ్యంగా తితిలీ, ఫైలిన్, కరోనా, పంచాయతీ ఎన్నికల సమయంలో ఆమె అద్భుతమైన సేవలు అందించారని చెప్పారు. సమాచార శాఖలో ఉద్యోగులు సమయపాలనతో నిమిత్తం లేకుండా విధులు నిర్వహించాల్సి వస్తుందని, అటువంటి పరిస్థితిల్లో కూడా ఆమె అద్భుతంగా పనిచేసారని తెలిపారు. సుమారు 35 ఏళ్ల పాటు ఎటువంటి రిమార్కులు లేకుండా ఈ శాఖలో పనిచేసి, అందరి అధికారులు మన్ననలను పొందిన ఘనత ఆమెకు దక్కుతుందని చెప్పారు. ఆమె జిల్లాలో అందించిన సేవలకు గుర్తుగా జిల్లాలోని మహిళా అధికారులు ప్రశంసలు కురిపించడమే కాకుండా, సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం ఆమె పట్ల గౌరవంగా భావించాలని అన్నారు.             పదవీ విరమణ పొందిన లక్ష్మీకాంతం ఆమె స్పందనను తెలియజేస్తూ నేను శాఖలో ఇంత గొప్పగా చేసిన విషయం తనకు తెలియదని, అధికారుల అభిమానం చూస్తే ఆనందంగా ఉందని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా మాత్రమే తనకు అప్పగించిన పనిని బాధ్యతగా చేయడం జరిగిందని, ఇందుకు అందరు అధికారులు తనకు పూర్తి సహాయ సహకారాలు అందించారని చెప్పారు. వారందరికీ ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.           ఈ కార్యక్రమంలో విజయనగరం , విశాఖపట్నం, పార్వతీపురం డివిజనల్ పౌర సంబంధాల అధికారులు యస్.జానకమ్మ, డి.సాయిబాబా, కె.బాలమాన్ సింగ్, ఆడియో విజువల్ సూపర్ వైజర్లు ఐ.శ్రీనివాసరావు, డి.సత్యనారాయణ, బి.కృష్ణారావు, సీనియర్ సహాయకులు పి.మురళీ, ఆర్.కేశ్వరమ్మ, విశ్రాంత డివిజనల్ పౌర సంబంధాల అధికారి జి.అప్పారావు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.