సచివాలయ నియామక పరీక్షలకు పక్కా ఏర్పాట్లు..
Ens Balu
2
Visakhapatnam
2020-08-19 19:43:24
విశాఖపట్నం జిల్లాలో సెప్టెంబరు 20వ తేదీన నిర్వహించనున్న సచివాలయ ఉద్యోగుల నియామక పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేస్తామని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ తెలిపారు. బుధవారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో విశాఖపట్నం నుంచి ఆయన పాల్గొన్నారు. అభ్యర్ధులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లాలో క్లష్టర్ లు అందరికీ అనుకూలంగా వుండే విధంగా పునర్ వ్యవస్దీకరిస్తామని చెప్పారు. కరోనా నేపద్యంలో తగిన జాగ్రత్తలను తీసుకుంటామని, నిబంధనల ననుసరిస్తూ పాజిటివ్ , లక్షణాలు వున్న అభ్యర్ధులకు ప్రత్యేక గదులు కేటాయించడం జరుగుతుందన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలను ఒక సవాల్‌గా తీసుకోవలసిన అవసరం వుందని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. బుధవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షలపై అన్ని జిల్లా కలెక్టర్లతో మంత్రి, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ కమిషనర్ గిరిజా శంకర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. విశాఖపట్నం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరు తో పాటు జివియంసి కమిషనర్ డా.జి.సృజన, జిల్లా పరిషత్ సి.ఈ.వో. నాగార్జున సాగర్, జిల్లా పంచాయితీ అధికారి కె.కృష్ణకుమారి, డి.ఆర్.ఒ. ఎ.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.