విధి నిర్వహణే ఉద్యోగికి పేరుతెచ్చేది..


Ens Balu
2
శ్రీకాకుళం
2021-02-28 22:32:55

విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేసిన అధికారిగా కృష్ణారావు మంచి గుర్తింపును తెచ్చుకున్నారని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థలో  జిల్లా మేనేజర్ గా పనిచేస్తున్న ఎ.కృష్ణారావు ఉద్యోగ విరమణ అభినందన సభ స్థానిక ఆనందమయి ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ  పౌర సరఫరాలలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. వాటిన్నింటిని సమర్ధవంతంగా పనిచేసి జిల్లాకు మంచి సేవలు అందించారని చెప్పారు. పౌర సరఫరాల శాఖలో  ఇ-పాస్ విధానం అమలయ్యే సమయంలో జిల్లాలో సమర్ధవంతంగా అమలయ్యేలా కృషిచేసిన వ్యక్తి కృష్ణారావు అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పైలెట్ ప్రోజెక్టుగా ప్రవేశపెట్టిన నాణ్యమైన బియ్యం అమలు కార్యక్రమాన్ని విజయవంతంగా  నిర్వహించారని చెప్పారు. అలాగే ఎన్నికల సమయంలో పరిశీలకులతో సమన్వయ బాధ్యతలను చక్కగా నిర్వహించారని, ఒక్కరి వద్ద నుండి కూడా తమకు ఫిర్యాదు అందలేదని, ఇది చాలా గొప్ప విషయమని కితాబిచ్చారు. జిల్లాలో అమలైన ఇంటింటికి బియ్యం సరఫరా కార్యక్రమంలో కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించారని, సార్టెక్స్ బియ్యం పంపిణీ లోను మన జిల్లా మంచి స్థానంలో నిలిచిన సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. ధాన్యం సేకరణ తదితర సందర్భాల్లో కూడా మంచి సమన్వయం చేసి రైతులకు మంచి గిట్టుబాటు ధరను అందించడంలో కూడా కృష్ణారావు విశేష కృషిచేసారని అన్నారు.  కరోనా సమయంలో నెలలో రెండు సార్లు ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి వచ్చిందని, అటువంటి సమయంలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పంపిణీ చేసిన ఘనత కృష్ణారావుకి దక్కిందని చెప్పారు. కృష్ణారావు శాంతి స్వభావం గలవారని,  అదే శాంతి స్వభావంతో విధులను సక్రమంగా నిర్వర్తించారని కలెక్టర్ వివరించారు. అనంతరం సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులతో కలిసి పుష్పమాలను వేసి జ్ఞాపిక, దుశ్శాలువతో సత్కరించారు. సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ మిగిలిన శాఖల కంటే పౌర సరఫరాల శాఖ విధులు విభిన్నమైనవని, అటువంటి విధులను సైతం సక్రమంగా నిర్వహించిన ఘనత కృష్ణారావుదేనని తెలిపారు. జిల్లాలో పైలెట్ ప్రోజెక్టుగా ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ విషయంలో ఏ ఒక్కరి నుండి ఫిర్యాదు లేకుండా సక్రమంగా పంపిణీ చేసిన ఘనత ఆయనకు దక్కుతుందని చెప్పారు. రేషన్ విషయంలో డీలర్ల దగ్గర నుండి మరలా ప్రజలకు రేషన్ చేరేవరకు పక్కా ప్రణాళిక ప్రకారం కార్యక్రమాన్ని అమలుచేసారని కొనియాడారు. కొన్ని సందర్భాలలో తమకు తెలియకుండానే పనులు సక్రమంగా జరిగిపోయేవని, ఇలాంటి అధికారులు జిల్లాలో ఉండటం వలనే ఏ కార్యక్రమమైన విజయవంతంగా అమలవుతాయని చెప్పారు. ఈ అభినందన సభలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంఘాలు, పౌర సరఫరాల శాఖ, పౌర సరఫరాల సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.