పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి..
Ens Balu
2
Vizianagaram
2021-03-01 14:33:19
మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రిసైడింగ్ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కోరారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేసేందుకు అనుగుణమైన వాతావరణాన్ని కల్పించడం, వేగంగా ఓటింగ్ జరిగేలా చూడటం ద్వారా పోలింగ్ శాతాన్ని పెంచవచ్చని సూచించారు. పిఓలు, ఏపిఓలు, జోనల్ అధికారులకు కలెక్టరేట్‌లో సోమవారం ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లు ఎండకు ఇబ్బంది పడకుండా నీడ కల్పించాలని, త్రాగునీరు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో పిఓల పాత్ర చాలా కీలకమన్నారు. వివాదాలకు అవకాశం ఇవ్వకుండా, సమర్ధవంతంగా, సత్ప్రవర్తనతో విధులను నిర్వహించడం ద్వారా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని చెప్పారు. నిష్పాక్షికంగా, పారదర్శకంగా, తటష్టంగా విధులను నిర్వహించాలని సూచించారు. నిర్ణీత సమయం ఉదయం 7గంటలకే ఖచ్చితంగా పోలింగ్ మొదలు కావాలని, సమయం ముగిసేవరకూ ఎట్టి పరిస్థితిలోనూ పోలింగ్‌కి విరామం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనావళిని తప్పనిసరిగా అమలు చేయాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని రకాల ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించడంతోపాటు, అత్యధిక ఓటింగ్ శాతాన్ని నమోదు చేయడంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ పేరును నిలబెట్టేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు.
ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి ఎస్.అప్పలనాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎన్నికల విధులను వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో విజయనగరం మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, సహాయ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్ పి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.