జిల్లా కోఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..
Ens Balu
3
Srikakulam
2020-08-19 21:05:00
శ్రీకాకుళం జిల్లాలో గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ శాఖలో సమన్వయకర్తల పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని గ్రామ, వార్డు సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. ప్రజల చెంతకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించుటలో భాగంగా వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధ ఏర్పాటు చేసిన సంగతి విదితమేనని పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో పనిచేయుటకు జిల్లా సమన్వయకర్త , సహాయ జిల్లా సమన్వయకర్త, పట్టణ సమన్వయకర్త పోస్టులను మంజూరు చేసారని బుధ వారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులను డిప్యుటేషన్ లేదా నేరుగా భర్తీ చేయడం జరుగుతుందని చెప్పారు. అర్హులైన అభ్యర్ధులు వారం రోజులలోగా వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేయవచ్చని ఆయన తెలిపారు. జిల్లా సమన్వయకర్తకు రూ.36 వేలు, సహాయ జిల్లా సమన్వయకర్త, పట్టణ సమన్వయకర్త పోస్టులకు రూ.27 వేలు పే స్కేలుగా నిర్ణయించారని చెప్పారు. ఈ బృందం గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధల ద్వారా జరుగుతున్న కార్యక్రమాల వివరాలు సేకరించడం, విశ్లేషించడం, అందులో మెరుగ్గా చేప్టటుటకు అవకాశాలు గుర్తించడం, బలహీనతలు, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు గుర్తించడం తదనుగుణంగా విశ్లేషణ చేసి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం చేయాల్సి ఉంటుందని డా.శ్రీనివాసులు తెలిపారు. జిల్లా సమన్వయకర్త నివేదికలను జాయింట్ కలెక్టర్ కు, రాష్ట్ర సమన్వయకర్తకు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. పథకం వారీగా, కార్యక్రమం వారీగా విశ్లేషించాలని పేర్కొన్నారు. కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలు చేయుటకు అవసరమగు వ్యవస్ధాపరమైన, యాజమాన్యపరమైన, అభివృద్ధి పరమైన నైపుణ్యాలను మైక్రోసాఫ్ట్ ఆఫీసు కార్యక్రమాల ద్వారా రూపొందించే సామర్ధ్యం ఉండాలని పేర్కొన్నారు.
జిల్లా సమన్వయకర్త పోస్టుకు కంప్యూటర్ స్పెషలైజేషన్ తో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులైన పోస్టుగ్రాడ్యుయేషన్ తోపాటు డేటాను విశ్లేషణ, మంచి ప్రెజెంటేషన్ లు తయారు చేయు సామర్ధ్యం, ఎం.ఐ.ఎస్ నివేదికలు తయారు చేయు సామర్ధ్యం కలిగి ఉండాలన్నారు. సహాయ జిల్లా సమన్వయకర్త, టౌన్ సమన్వయకర్త పోస్టులకు కంప్యూటర్ స్పెషలైజేషన్ తో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులైన పోస్టుగ్రాడ్యుయేషన్ అభ్యర్ధులు అర్హులన్నారు. జిల్లా సమన్వయకర్త పోస్టుకు జిల్లా యంత్రాంగానికి డేటా విశ్లేషణ నైపుణ్యాలు, ఎం.ఐ.ఎస్ నివేదికల తయారీ చేసిన అనుభవానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. సంబంధిత రంగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలని తెలిపారు. సహాయ జిల్లా సమన్వయకర్త, టౌన్ సమన్వయకర్త పోస్టులకు పేరుగాంచిన సంస్ధలలో సంబంధిత రంగంలో కనీసం ఒక ఏడాది అనుభవం ఉండాలని చెప్పారు. అభ్యర్ధుల గరిష్ట వయస్సు 50 సంవత్సరాలకు మించరాదని అన్నారు. ఎస్.సి, ఎస్.టి అభ్యర్ధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుందని తెలిపారు. అనుభవం, ఆసక్తిగల అభ్యర్ధులు తమ దరఖాస్తులను 7 రోజుల లోగా వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ కు సమర్పించాలని డా.శ్రీనివాసులు తెలిపారు.