తడిపొడి పొడిచెత్త విడివిడిగా అందించాలి..


Ens Balu
3
Visakhapatnam
2021-03-02 19:14:36

జివిఎంసి మూడవ జోన్ పరిధిలో 19 వ వార్డులోని పెద్ద జాలారిపేట ప్రాంతంలో చేపడుతున్న పనులను సత్వరమే పూర్తిచేయాలని జివిఎంసి కమిషనర్ నాగలక్ష్మి .ఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవార ఈ ప్రాంతంలో పర్యటించి అక్కడ జివిఎంసి వివిధ విభాగాలు చేపడుతున్న పలు పనులను పరిశీలించారు. పెద్ద జాలారిపేట లోని పలు పనులను ఆమె స్వయంగా సందర్శించి అక్కడ ప్రజలతో మాట్లాడారు.. ముఖ్యంగా, పారిశుధ్యపు విభాగాలు చేపడుతున్న పనులు, మంచినీటి సరఫరా జరుగుతున్న తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సామాజిక సౌచాలయాలను (టోయ్ లెట్లను) స్వయంగా పరిశీలించి వాటిని అక్కడగల ప్రజలు తప్పని సరిగా వినియోగించుకోనేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని, వాటిని నిరంతరం పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. కాలువలు పూడికతీత, రోడ్లను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడడం వంటివి శానిటరీ కార్యదర్శులు బాధ్యతలు తీసుకోవాలని మైక్రో పాకెట్ విధానాన్ని అనుసరించి గృహాల నుండి చెత్త సేకరణను “తడి - పొడి” మరియు “ప్రమాదకర” చెత్తగా విడదీసి వాహనానికి అందించేటట్లు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కార్యదర్శులను ఆదేశించారు. పెద్ద జాలరిపేట బీచ్ ప్రాంతాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లను ఆదేశించారు. సముద్రంలోకి కలుస్తున్న కాలువ నీటిని ఎస్.టి.పి. వైపు మళ్ళించడానికి గల అవకాశాలను గూర్చి ఇంజినీరింగు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, పర్యవేక్షక ఇంజినీరు వినయ్ కుమార్, జోనల్ కమిషనర్ – 3 శ్రీనివాసరావు, అసిస్టెంట్ సిటీ ప్లాన్నర్ భాస్కర్ బాబు, స్మార్ట్ సిటీ కార్యనిర్వాహక ఇంజినీరు సుధాకర్, డిప్యూటీ ఇంజినీరు శ్రీనివాస్, నీరు, ఎలక్ట్రికల్ విభాగపు సహాయక ఇంజినీరులు విల్సన్, నాయుడు, శానిటరీ సూపర్వైజర్ జనార్ధన్, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, మలేరియా ఇన్ స్పెక్టర్లు, వార్డు శానిటరీ కార్యదర్శులు  తదితరులు పాల్గొన్నారు.