ఇంటింటి బియ్యంపై కమిషనర్ ఆరా..
Ens Balu
3
Vizianagaram
2021-03-02 19:29:02
అమ్మా బియ్యం ఎలా ఉన్నాయి ?. ఇంటింటికీ తెచ్చి పంపిణీ చేస్తున్నారా?. మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ?. ఇంతకు ముందు పద్దతి బాగుందా ? ఇప్పటి పద్దతి బాగుందా ?. ఎన్నిరోజుల ముందు మీకు సమాచారం ఇస్తున్నారు ?. తూకం సరిపోతోందా ?. సంచిల్లో వేసి ఇస్తున్నారా ?. అంటూ రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్ ప్రశ్నించారు. ఆయనే నేరుగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి, ఇంటింటికీ రేషన్ సరఫరా పథకంపై వాకబు చేశారు. ఆయన రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు సర్వోన్నతాధికారి అయినప్పటికీ ఆయన ఎటువంటి భేషజాలకు పోకుండా, తన హోదాను ప్రక్కనపెట్టి మురికివాడల్లో సైతం ఇంటింటికీ పర్యటించారు. ఇంటింటికీ రేషన్ పథకం అమలు తీరుపై వాకబు చేశారు. పథకంపై పేద ప్రజల అభిప్రాయాలను, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంచార వాహనాల ద్వారా జరుగుతున్న సరుకుల పంపిణీని స్వయంగా పరిశీలించారు. విజయనగరం పట్టణంలోని లంకాపట్నం, బొగ్గులదిబ్బ ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు.
లంకా పట్నంలో పలువురు మహిళలతో కమిషనర్‌తో మాట్లాడారు. బియ్యం చాలా బాగున్నాయని లబ్దిదారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. రేషన్ కోసం ఇంతకుముందు డిపోలవద్ద గంటలు గంటలు నిల్చొని ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందని వారు చెప్పారు. తమ వీధిలోకే బండి ద్వారా సరుకులు తెచ్చి ఇస్తున్నారని తెలిపారు. తూకాల్లో తేడా లేదని, సంచిలో సరుకులు వేసి అందిస్తున్నారని చెప్పారు. ఎండియు ఆపరేటర్లతో కూడా కమిషనర్ మాట్లాడారు. వారి సమస్యలపైనా దృష్టి పెట్టారు. తమ ప్రాంతంలోనే, తమ వారికే సరుకులు అందించే పని దొరకడం చాలా గౌరవమని, దానిని నిలబెట్టుకోవాలని వారిని శశిధర్ కోరారు. వీలైనంత త్వరగా సరుకులను పంపిణీ చేయాలని, రోజుకు కనీసం 150 మంది లబ్దిదారులకు పంపిణీ చేయాలని ఆయన సూచించారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసిహెచ్ కిశోర్ కుమార్, డిఎస్ఓ పాపారావు, సివిల్ సప్లయిస్ డిఎం భాస్కర్రావు, విజయనగరం తాశీల్దార్ ఎం.ప్రభాకరరావు, సిఎస్‌డిటిలు జగన్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.