ప్రతీ ఎకరాకు సాగునీరు అందాలి..
Ens Balu
4
Kakinada
2021-03-02 20:32:29
తూర్పుగోదావరి జిల్లాలో రబీ వరి సాగుకు నీటి ఎద్దడి లేకుండా పటిష్ట ప్రణాళికతో వ్యవహరిస్తున్నామని, నిరంతర పర్యవేక్షణతో ప్రతి ఎకరాకూ సాగునీరు అందేలా చూస్తున్నామని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులు; సాగు, తాగునీటికి కొరత లేకుండా తీసుకుంటున్న చర్యలపై జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖ అధికారులతో రబీసాగుకు నీటి సరఫరా స్థితిగతులు, పంట పరిస్థితులపై సమీక్షించారు. సాగునీటికి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూర్తిస్థాయిలో దిగుబడులు సాధించేలా నీటి తడులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ పనుల నేపథ్యంలో ఈ నెల చివరి నాటికి గోదావరి కాలువలకు నీటి సరఫరా నిలిచిపోనున్నందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న విలువైన సమయంలో క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ రబీ పంట ప్రణాళికను దిగ్విజయంగా పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో దాళ్వా పంట కాలంలో 1,61,632 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగవుతోందని.. చిన్నా, పెద్ద అనే తేడాలేకుండా ప్రతి రైతుకూ మేలు జరిగేలా చూడాలన్నారు. సాగునీటిపై ఒత్తిడి ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని, ఆయా మండలాల్లో రైతుల బృందాలు/రైతులు ఏర్పాటు చేసుకున్న ఇంజన్లకు ప్రభుత్వమే ఆయిల్‌ను అందిస్తోందని తెలిపారు. డ్రెయిన్ల నుంచి నీటిని కాలువలకు ఎత్తిపోసి, అక్కడి నుంచి నీటిని పంటలకు మళ్లిస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ఈ సౌకర్యం అవసరమైన రైతులు గ్రామ వ్యవసాయ సహాయకుల (వీఏఏ)ను సంప్రదించాలని సూచించారు. వీఏఏల సిఫార్సుతో ఇరిగేషన్ ఏఈలు తగిన చర్యలు తీసుకుంటారని వివరించారు. ప్రస్తుతం ఆయిల్ సరఫరాకు తూర్పు డెల్టాలో 24 ఏజెన్సీలు, సెంట్రల్ డెల్టాలో ఎనిమిది ఏజెన్సీలు పనిచేస్తున్నాయని, మరికొన్ని కూడా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. గ్రామ వ్యవసాయ సహాయకులు మొదలు అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని, ఎప్పటికప్పుడు వారికి అవసరమైన సలహాలు అందించాలని సూచించారు. ప్రతి నీటిబొట్టు ప్రాధాన్యాన్ని గుర్తెరిగి, రైతులు కూడా పొదుపు చర్యలు పాటించాలని కోరారు. తూర్పు డెల్టాలో కాజులూరు, కరప, తాళ్లరేవు, పెదపూడి, ఆలమూరు, కపిలేశ్వరపురం, కె.గంగవరం, రామచంద్రాపురం తదితర మండలాలతో పాటు సెంట్రల్ డెల్టాలోని అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, మామిడికుదురు, అయినవిల్లి తదితర మండలాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. తక్కువ నీటితో పంట సాగుచేసి అధిక దిగుబడులు సాధించేందుకు వీలుకల్పించే ఎండు-పండు విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అదేశించారు. తాగునీటి విషయంలోనూ ప్రజలు పొదుపు చర్యలు పాటించేలా చూడాలన్నారు. నెలాఖరు నాటికి అన్ని ట్యాంకులూ పూర్తిస్థాయిలో నిండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈసారి ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యలపై స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
ఎండు-పండు విధానంతో అధిక దిగుబడులు: వ‌్యవసాయ అధికారులు
ప్రస్తుతం సాగునీటికి ఇబ్బంది ఏమీ లేదని వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. ఇన్‌ఫ్లో తగ్గిన నేపథ్యంలో
సాగునీటికి ఒత్తిడి ఉన్న ప్రాంతాల్లో పొదుపు చర్యలు పాటించాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. ఎండు-పండు విధానంతో మంచి ఫలితాలు ఉంటాయని.. ఈ విధానంలో నీటిని నిలగట్టడం అనేది ఉండదని, పొలంలోని మట్టి తడిగా ఉంటే సరిపోతుందన్నారు. పిలకల ఉద్ధృతి పెరగడంతో పాటు కంకులు వేసే పిలకల సంఖ్య కూడా పెరుగుతుందని, తద్వారా దిగుబడి అధికమవుతుందని వివరించారు. తక్కువ నీటి వినియోగంతో చీడపీడల ఉద్ధృతి కూడా తగ్గేందుకు అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో పురుగు మందుల ఖర్చు తగ్గి, పెట్టుబడులు తగ్గుతాయని వివరించారు. సమావేశంలో ఇరిగేషన్, డ్రెయిన్, గ్రామీణ నీటి సరఫరా అధికారులు ఆర్.శ్రీరామకృష్ణ, టి.గాయత్రీదేవి, రవికుమార్, ఐవీ సత్యనారాయణ, కె.రాంబాబు, కె.వెంకటేశ్వరరావు తదితరులతో పాటు వ్యవసాయ శాఖ జేడీ కేఎస్‌వీ ప్రసాద్, డీడీ రామారావు తదితరులు పాల్గొన్నారు.