పాఠశాల విద్యను మరింత అభివ్రుద్ధి చేస్తాం..


Ens Balu
3
Kothapeta
2021-03-03 13:50:29

విద్యార్థుల‌కోసం ప్ర‌భుత్వం ఎన్నో సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తోంద‌ని, వాటిని వినియోగించుకొని బాగా క‌ష్ట‌ప‌డి చ‌దివి, మంచి పేరు తెచ్చుకోవాల‌ని పాఠ‌శాల‌ విద్యాశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుడితి రాజ‌శేఖ‌ర్ కోరారు.   విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణం, కొత్త‌పేటలో నాడూ-నేడు కార్య‌క్ర‌మం క్రింద అభివృద్ది చేసిన పుర‌పాల‌క‌ ప్రాధ‌మిక పాఠ‌శాల‌ను ఆయ‌న బుధ‌వారం సంద‌ర్శించారు. ప్ర‌తీ త‌ర‌గ‌తి గ‌దినీ, విద్యార్ధుల‌ను, వారి యూనిఫారాల‌ను, బ‌ల్ల‌ల‌ను, గోడ‌ల‌కు వేసిన రంగులు, చిత్రాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. చేపట్టిన‌ అభివృద్ది ప‌నుల‌ప‌ట్ల ఆయ‌న సంతృప్తిని వ్య‌క్తం చేశారు. పాఠ‌శాల రూపురేఖ‌లు సంపూర్ణంగా మారిపోయాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.   ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌తో రాజ‌శేఖ‌ర్ మాట్లాడారు. ప్ర‌భుత్వం క‌ల్పించిన వ‌స‌తుల‌ప‌ట్ల ఆరా తీశారు. బ‌ల్ల‌లు సౌక‌ర్య‌వంతంగా ఉన్న‌దీలేనిది అడిగి తెలుసుకున్నారు.  వివిధ అంశాల‌ప‌ట్ల వారి‌ అవ‌గాహ‌నా స్థాయిని ప‌రిశీలించారు. అల్ల‌రి చేయ‌కుండా పాఠాలు వినాల‌ని సూచించారు. సందేహాలు అడిగిన వారే మంచి విద్యార్థుల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో మొక్క‌ను నాటారు.  ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, స‌మ‌గ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ విక్ట‌ర్ సెల్వి, మౌళిక వ‌స‌తుల కల్ప‌న స‌ల‌హాదారు ముర‌ళి, జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, డిఇఓ జి.నాగ‌మ‌ణి,  అసిస్టెంట్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పివివిడి ప్ర‌సాద‌రావు, ఎంఇఓ రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.