జలకళ లక్ష్యాలు తక్షణమే పూర్తి చేయాలి..


Ens Balu
3
Srikakulam
2021-03-03 14:04:59

శ్రీకాకుళం జిల్లాలో జలకళ లక్ష్యాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. జలకళ బోర్లకు రైతులు www.ysrjalakala.ap.gov.in వెబ్సైట్ లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చని  కలెక్టర్ చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి దరఖాస్తు చేయుటకు సహకరించాలని ఆదేశించారు. జలకళ ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఉచితంగా ప్రభుత్వం బోర్లను వేయడం జరుగుతుందని తెలిపారు.  జలకళ లక్ష్యాలు, పనుల ప్రగతిని బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జియాలజిస్టులు త్వరితగతిన పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికి 10 శాతం మాత్రమే పూర్తి చేయడం పట్ల ప్రశ్నించారు. కనీసం రెండు మండలాలకు ఒక జియాలజిస్టును ఏర్పాటు చేయాలని సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు. నియోజకవర్గంలో కనీసం రెండు రిగ్ లు ఉండాలని ఆయన ఆదేశించారు. జలకళ కార్యక్రమం జిల్లాకు అత్యంత ప్రయోజనకరమని అన్నారు. ఖరీఫ్ లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, రబీలో కేవలం 40 లేదా 50 వేల టన్నులు మాత్రమే సేకరణ జరుగుతుందని చెప్పారు. మందస, పాతపట్నం, భామిని తదితర మండలాల్లో సాగునీటి సదుపాయాలు లేవని, జలకళ ద్వారా లబ్ది పొందగలరని అన్నారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులు బాగా జరుగుటకు కృషి చేయాలన్నారు.  ఆసరా, సంక్షేమం జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ లక్ష్యాలను చేరుటకు సరాసరిన రోజుకు నాలుగు బోర్లు తవ్వాలని పేర్కొన్నారు. అధికంగా ఏ ప్రాంతాల్లో తవ్వాలో గుర్తించాలని ఆదేశించారు. రిగ్ లను జిల్లా నీటియాజమాన్య సంస్థ ఏపిడిలు, జియాలజిస్టుల ఆధ్వర్యంలో ఉంచాలని పేర్కొన్నారు. జిల్లా నీటియాజమాన్య సంస్థ పిడీ హెచ్.కూర్మారావు మాట్లాడుతూ కనీసం 2.50 ఎకరాలు ఉండాలన్నారు. జిల్లాలో వెయ్యి బోర్లు లక్ష్యం కాగా 990 బోర్లు ఇంకా తవ్వాలని ఆయన తెలిపారు. 1141 దరఖాస్తులు అందాయని ఆయన అన్నారు. జిల్లాలో మూడు రిగ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో భూగర్భ జలాల శాఖ డిడి సి.ఎస్.రావు, జిల్లా నీటియాజమాన్య సంస్థ ఏపిడిలు డా.విద్యాసాగర్, పి.రాధ, రోజారాణి, అలివేలు, శైలజ, రామారావు, జియాలజిస్టులు, రిగ్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.