అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ అందుతుంది..


Ens Balu
2
Srikakulam
2021-03-04 22:08:51

ప్రతి ఒక్క బియ్యం కార్డుకు రేషన్ అందుతుందని జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి నెల రేషన్ పంపిణీ కొద్దిగా ఆలస్యంగా ప్రారంభించడంతో దాదాపు 6 శాతం మంది విడిపించుకోలేకపోయారని, రేషన్ రాదని ఆందోళన చెందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జెసి చెప్పారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రేషన్ విడిపించుకోని అర్హులైన అందరికి అందుతుందని స్పష్టం చేసారు. రేషన్ సరుకుల పంపిణీపై గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ వివరాలు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్ధ క్రింద ఫిబ్రవరి నెలకు ఇచ్చే రేషన్ పంపిణీ ఆలస్యంగా ప్రారంభం కావడంతో మార్చి గురు వారం నాటికి పంపిణీ కార్యక్రమం పూర్తి అవుతుందని అన్నారు. అయితే రేషన్ అందని వారికి మార్చి నెల రేషన్ తోపాటు అందించడం జరుగుతుందని వివరించారు. ఈ రేషన్ ను మార్చి 10వ తేదీ లోగా విడిపించుకోవాలని ఆయన కోరారు. ఈ అవకాశం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వర్తిస్తుందని, పట్టణ ప్రాంతాలలో మార్చి 5 నుండి 10వ తేదీ వరకు, గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 6 నుండి 10వ తేదీ వరకు రేషన్ విడిపించకోవాలని సూచించారు. మార్చి నెల రేషన్ గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 6వ తేదీన ప్రారంభం అవుతుందని వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో మార్చి నెల రేషన్ 1వ తేదీ నుండి ప్రారంభం అయిందని యధావిధిగా పంపిణీ జరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే 27 శాతం పంపిణీ జరిగిందని చెప్పారు. బియ్యం కార్డును ఇపాస్ లో నమోదు చేసిన వెంటనే రేషన్ విడిపించని కార్డుదారుల వివరాలు వస్తాయని వారికి రెండు నెలల రేషన్ ను సింగిల్ అథెంటికేషన్ తో పంపిణీ చేస్తామని అన్నారు. నెలల వారీగా తీసుకున్న వివరాలు వేరు వేరుగా ప్రింటింగు అవుతాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో శుక్ర వారం ఎటువంటి పంపిణీ ఉండదని గమనించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. రేషన్ పంపిణీ సాఫీగా జరుగుతోందని, ఎదురౌతున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని జెసి వివరించారు. పట్టణ రేషన్ పంపిణీ వాహనదారులకు వేతనం జమ జరిగిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల వాహనాలకు రెండు, మూడు రోజుల్లో జమ అవుతుందని పేర్కొన్నారు.