మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం..
Ens Balu
1
Visakhapatnam
2021-03-04 22:22:17
విశాఖ జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం జివిఎంసి సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న పొరపాటు కూడా లేకుండా ఏర్పాట్లన్నీ పక్కాగా చేయాలన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపరు, బ్యాలెట్ పెట్టెలు మొదలైనవన్నీ సిద్ధం చేసి జోనల్ కార్యాలయాలకు అందజేయాలన్నారు. జోనల్ కమిషనర్లు పోలింగ్ స్టేషన్ల వారీగా విభజన చేయాలన్నారు. సెక్టార్, రూట్ అధికారులు తాము చేయబోయే పనులకు సిద్ధం కావాలన్నారు. ఓటర్ల జాబితాలు, మార్కుడు కాపీలు సిద్ధం చేసుకోవాలని ఫోటో వోటర్ స్లిప్పులు పంపిణీ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాలను మరోసారి తనిఖీ చేసి తాగునీరు, వాడుక నీరుతో సహా అన్ని మౌలిక వసతులు పరిశీలించాలన్నారు.వారికి కేటాయించిన మార్గాల ద్వారా రవాణా ఏర్పాట్లు పోలింగ్ అధికారులు సిబ్బంది సూక్ష్మ పరిశీలకులు వీడియోగ్రఫీ వెబ్ కాస్టింగ్ లను బట్టి అవసరమగు వాహనాల సంఖ్య సరి చూసుకోవాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టేటజిక్ సర్వెలన్స్ టీమ్ లు వేగంగా స్పందించాలన్నారు. 8వ తేదీ సాయంత్రం గం.5-00ల నుండి మద్యం విక్రయాలను ఆపివేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ లను సిద్ధం చేయాలన్నారు. రేపటి నుంచి 9వ తేదీ సాయంకాలం వరకూ జోనల్ కమిషనర్ల పరిధిలో ఏర్పాట్లను పూర్తి చేయవలసి ఉంటుందన్నారు.
10 వ తేదీన సెలవు
జిల్లాలో జివిఎంసి ఎలమంచిలి మునిసిపాలిటీల్లో ఉన్నందున ఈ నెల 10వ తేదీన ప్రభుత్వ సెలవు దినాన్ని ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జివియంసి కమిషనర్ నాగమణి, జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాలరెడ్డి, ఆర్.గోవిందరావు, అడిషనల్ కమిషనర్లు ఆశాజ్యోతి, రమణి, సన్యాసిరావు, ఆర్డీవోలు పెంచల కిషోర్, సీతారామారావు తదితరులు పాల్గొనగా నర్సీపట్నం సబ్-కలెక్టరు ఎన్.మౌర్య, ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.