ఎస్ఇసికి మైక్రో అబ్జర్వర్లే కళ్లూచెవులూ..
Ens Balu
1
Vizianagaram
2021-03-04 22:43:38
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు మైక్రో అబ్జర్వర్లే కళ్లూ చెవులు లాంటివారని జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు కాంతిలాల్ దండే అన్నారు. సూక్ష్మ పరిశీలకులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంతిలాల్ దండే మాట్లాడుతూ నిభందనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నదీ లేనిదీ పరిశీలించాల్సిన బాధ్యత మైక్రో అబ్జర్వర్లపైనే ఉందన్నారు. సమస్యాత్మక, సున్నిత, అతి సున్నిత ప్రాంతాల్లో వీరంతా విధులను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతీ అంశాన్నీ క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని సూచించారు. పోలింగ్ ముందురోజు ఉదయం 8 గంటలు నుంచీ, పోలింగ్ రోజు ఉదయం 6 గంటలు నుంచే విధులను ప్రారంభించాలన్నారు. నిభందనల ఉల్లంఘనపైనా, అవాంఛిత సంఘటనలపైనా దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సూక్ష్మ పరిశీలకులపై ఉందని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, జిల్లా ఎన్నికల పరిశీలకుల ఆధీనంలో, సూక్ష్మ పరిశీలకులంతా పనిచేయాల్సి ఉంటుందన్నారు. పంచాయితీ ఎన్నికలకు భిన్నంగా, పార్టీల గుర్తులతో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని, అందువల్ల ప్రతీఒక్కరూ మరింత అప్రమత్తంగా విధులను నిర్వహించాలని కోరారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓట్ల శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, ఎలక్షన్ ట్రైనింగ్ ఆఫీసర్ ఎస్.అప్పలనాయుడు పాల్గొన్నారు.