మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ పెరగాలి..
Ens Balu
1
Anantapur
2021-03-04 22:47:27
మున్సిపల్ ఎన్నికలలో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ డి ఈ ఓ, ఎం ఈ ఓలు, ప్రధానోపాధ్యాయులు లు, ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంపొందించుటకు కృషి చేయాలన్నారు. జిల్లాలో నాలుగు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో 82.50 శాతం ఓటింగ్ నమోదైందని, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటింగ్ శాతం అత్యధికంగా నమోదయ్యేలా చూడాలన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని, ఓటు హక్కు ఉన్న వారి ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తీసుకువచ్చి ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఎక్కువ శాతం పోలింగ్ కేంద్రాలు ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేశారని, ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్లు కచ్చితంగా ఓటు వేసేలా చూడాలన్నారు. ఆయా పాఠశాలల పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్ల పరిధిలో విద్యార్థుల ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి అందరూ ఓటింగ్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా పాఠశాలల విద్యార్థులు తమ ఇంటిలో 18 ఏళ్లు నిండి ఓటుహక్కు ఉన్నవారు ఓటు వేసేలా వారికి తెలియజేయాలని, విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో పాటు వారి చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఓటు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు సంబంధించి విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎన్నికల ప్రక్రియ, ఓటు ప్రాధాన్యత గురించి తెలియజేయాలని, దీని ద్వారా ఓటింగ్ శాతం పెంచడానికి వీలు కలుగుతుందన్నారు. ఏ పాఠశాల పరిధిలో అయితే ఎక్కువ శాతం పోలింగ్ శాతం నమోదు అవుతుందో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులను పిలిపించి వారిని సన్మానిస్తామన్నారు. ఒక ఛాలెంజ్ గా తీసుకొని మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు చేసేందుకు కృషి చేయాలన్నారు.
అలాగే ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నామని, ఓటర్ స్లిప్పులు అందరికీ అందాయా లేదా అనేది విద్యార్థులు చూడాలన్నారు. వృద్ధులు ఎవరు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వెంటనే వెళ్లి ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఇప్పటికే తెలియజేశామని, అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. అన్ని ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలను రప్పించి ఓటింగ్లో పాల్గొనేలా చర్యలు తీసుకున్నామని, అలాగే మున్సిపల్ ఎన్నికలలో కూడా వలస కూలీల లో వెనక్కి తీసుకు వచ్చి వారు పోలింగ్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగిన వారందరూ కచ్చితంగా ఓటు వేసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు ఎక్కువ శాతం పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే మున్సిపల్ కమిషనర్ల ద్వారా ఓటర్ల వివరాలు ముందస్తుగా సేకరించుకుని ప్రణాళిక బద్ధంగా కార్యచరణ చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఏ.సిరి, అసిస్టెంట్ కలెక్టర్ జి. సూర్య, డీఈవో శామ్యూల్, రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ నాగరాజు, నగరపాలక సంస్థ కమిషనర్ పివిఎన్ఎన్ మూర్తి, సమగ్ర శిక్ష ఏపీసీ తిలక్ విద్యాసాగర్, ఎంఈ ఓ లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.