నాడు-నేడు పాఠశాలల్లో సామగ్రి సమకూర్చాలి..


Ens Balu
3
Srikakulam
2021-03-05 17:23:59

నాడు - నేడు పాఠశాలల్లో సామగ్రి త్వరితగతిన సమకూర్చాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. జిల్లాలో నాడు - నేడు క్రింద పనులు చేస్తున్న పాఠశాలల్లో ఫర్నీచర్, పెయింటింగ్ సరఫరా అంశాలపై సంబంధిత కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. ప్రధాన ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలని, ఎంత పరిమాణంలో పెయింటింగ్, ఫర్నీచర్ కావాలో అంచనా వేసి ఇండెంట్ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఫర్నీచర్ ను బిగించుటకు మండలానికి రెండు బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. తద్వారా త్వరగా పని పూర్తి జరుగుతుందని పేర్కొన్నారు. మండల వారీ బృందాల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. అల్మరాలు తక్కువగా వచ్చాయని కలెక్టర్ అన్నారు. నీటి శుద్ది యంత్రాలను అమర్చుటకు కనీసం 10 బృందాలు ఏర్పాటు చేయాలని లివ్ ప్యూర్ ప్రతినిధిని ఆదేశించారు. పెయింటింగ్ పూర్తి చేయుటకు ఎక్కువ బృందాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. డ్రాయింగ్ ఉపాధ్యాయులు తమ మండల స్థాయిలో కమర్షియల్ పెయింటింగ్ చేయగల వ్యక్తులను గుర్తించాలని ఆదేశించారు. పాఠశాలల గోడలపై పెయింటింగ్, బొమ్మలకు సరైన స్థలాన్ని గుర్తించి పక్కాగా వేయాలని సూచించారు.  పాఠశాలలకు ఏ ఫర్నీచర్ సరఫరా చేయాలి, ఎంత పరిమాణంలో సరఫరా చేయాలో పక్కాగా ఆర్డర్ ఇవ్వాలని తద్వారా సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఫర్నీచర్ సరఫరాదారులు కోరారు. 15 బృందాలను జిల్లాలో ఏర్పాటు చేసి ఫర్నీచర్ ను బిగిస్తున్నామని మేథాడెక్స్ ఫర్నీచర్ కంపెనీ ప్రతినిధి కృష్ణంరాజు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్రకళ, ఉప విద్యా శాఖ అధికారి జి.పగడాలమ్మ, సమగ్ర శిక్షా అభియాన్ ఇఇ వి.వెంకట కృష్ణయ్య, ఏపిఇడబ్ల్యుఐడిసి ఇఇ కె.భాస్కరరావు, జెఇ కిరణ్ కుమార్, బెర్జర్, ఏసియన్ పెయింటింగ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.