విశాఖ ఉక్కు కోసం మంత్రి నిండైన నిరసన..
Ens Balu
4
Visakhapatnam
2021-03-05 20:29:15
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోరాటంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్, విశాఖ ప్రజల ఆత్మ గౌరవం కంటే తనకేమీ వద్దనుకున్నారు రాష్ట్రమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు..ఆయనొక మంత్రి అనే విషయాన్ని పక్కనపెట్టి రాష్ట్రబంద్ లో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. నడిరోడ్డుపై మటం వేసుకొని మరీ బైటాయించి స్టీలు ప్లాంట్ కోసం నినదించారు. ఒక రాష్ట్ర మంత్రిగా పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి విశాఖ వాసుల సెంటిమెంట్ కోసం తన హోదాను లెక్కచేయకుండా చేసిన పోరాటం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ అయ్యింది. సాధారణంగా రాజకీయ నాయకులు ఉద్యమాలు చేస్తే..ఖరీదైన పరుపులు, గాలి తగలడానికి మంచి ఫ్యాన్లు, నీడకోసం మంచి టెంట్లు ఇలా చాలానే ఉంటాయి. మీడియా హడావిడీ చెప్పాల్సిన పనేలేదు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రజాగ్రహం పెల్లుభుకిన సమయంలో విశాఖజిల్లా మంత్రి కూడా తన పోరాటాన్ని శక్తివంచన లేకుండా ప్రదర్శించారు. స్టీల్ కోసం తనస్థాయి తగ్గించుకొని మరీ నడిరోడ్డుపై కూర్చొని చేసిన ఆందోళన అందరికీ ఆలోచింపచేసింది. ఈ రాష్ట్రవ్యాప్త సమ్మెకు ప్రభుత్వమే పిలుపుఇవ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో బంద్ లో పాల్గొన్న మంత్రిని చూసి వెనుక నాయకులు, కార్యకర్తలు, వామపక్షనేతలు కూడా మంత్రితోపాటే రోడ్డుపైనే బైటాయించి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కి ఐకాన్ గా ఉన్న స్టీలు ప్లాంట్ ను పరిరక్షించుకోవాల్సిన అందరిపైనా ఉందన్నారు. అదేవిధంగా తమ ప్రభుత్వం కూడా విశాఖ వాసుల సెంటిమెంటుకి కట్టుబడి ఉందని చెప్పారు. స్టీలు ప్లాంట్ ను రక్షించుకోవడానికి ఎంతవరకైనా పోరాడతమన్న మంత్రితో అందరూ వంతపాడారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని కదం తొక్కారు. అనంతరం మంత్రి అవంతి జిల్లా ఇన్చార్జి మంత్రి కె.కన్నబాబు, రాజ్యసభ్ సభ్యులు వి.విజయసాయిరెడ్డితోపాటు ధర్నా, ర్యాలీ, మానవ హారంలో పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతున్నంతసేపూ అలా నడిరోడ్డుపైనే కూర్చొని మంత్రి తన నిరసనను తెలియజేస్తూ.. మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణశ్రీనివాస్, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇతర నాయకులు, కార్యకర్తలు,జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.