అల్లూరికి పోస్టల్ శాఖ తీరని అవమానం..
Ens Balu
1
క్రిష్ణదేవిట
2021-03-06 09:36:05
భారత పోస్టల్ శాఖ అల్లూరి సీతారామరాజుకి నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని నేడు ఏమీ కాకుండా తీసేసింది. అవును మీరు చదువుతన్నది అక్షర సత్యం.. నాడు అల్లూరి సీతారామరాజు తెల్లదొరలపై వీరోచితంగా పోరాటం చేసి, ప్రాణాలకు భరతకు అర్పించిన పోరాటాల పురిటి గడ్డ విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట( ఓల్డ్ క్రిష్ణ దేవిపేట అలియాస్ పాతూరు)లో అల్లూరి గుర్తుగా ఏర్పాటు చేసిన బ్రాంచి పోస్టాఫీసుని నేడు రద్దుచేసింది(పోస్టల్ పరిభాషలో ఇక్కడి బ్రాంచి వేరో బ్రాంచిలో విలీనం చేయడం). దానికి ఒక చిన్న సాంకేతిక కారణం చూపి అంటే ఎస్ ఓ పోస్టాఫీసుకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందనే ఒకే ఒక్క చిన్నకారణం చూపి మొత్తానికి ఇక్కడి పోస్టాఫీసుని రద్దు చేసి ఎక్కడో నర్సీపట్నం ప్రక్కన వున్న కొత్తకోట గ్రామం వద్ద వున్న పోస్టాఫీసులో విలీనం చేసింది. దీనితో అల్లూరి సీతారామరాజు ప్రాణాలకు తెగించి స్వాంత్ర్యం కోసం తెల్లవాడిపై పోరాటం చేసిన క్రిష్ణదేవిపేట ప్రాంతంలో అల్లూరికి గుర్తుగా వున్న పోస్టాఫీసు రద్దైపోయింది. ఫలితంగా మూడు గ్రామాల(పాత క్రిష్ణదేవిపేట, నాగాపురం, పల్లావూరు) ప్రజలకు పోస్టల్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఎప్పుడో 70 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ పోస్టాఫీసుని రద్దు చేసిన విషయం, ఈ గ్రామం స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర, అల్లూరి సీతారామరాజు తెల్లవాడిపై తిరుగుబాటు చేసిన మన్యం పితూరి ఉద్యమం గ్రామంలోనే ప్రారంభమవడం తదితర అంశాలను గుర్తుపెట్టుకొని అప్పటి కేంత్ర ప్రభుత్వం ఇక్కడ బ్రాంచి పోస్టాఫీసు ఏర్పాటు చేసింది అప్పటి నుంచి నిరాటంకంగా సేవలు ప్రజలకు అందుతూ వస్తున్నాయి. అయితే ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్నగ్రామంలో కేంద్రం ప్రభుత్వం పోస్టాఫీసు బ్రాంచిని రద్దుచేయడం(పోస్టల్ పరిభాషలో రీలొకేషన్) ఈప్రాంతీయుల మనోభావాలను దెబ్బతీయడంతోపాటు, ఈ అల్లూరి సీతారామరాజు ఉద్యమ చరిత్రకు సాక్ష్యంగా వున్న పోస్టాఫీసును రద్దు చేయడం చర్చనీయాంశం అవుతుంది. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ గ్రామంలోని పోస్టాపీసును తరలిస్తున్న విషయాన్ని అల్లూరి సీతారామరాజుపై వున్న దేశభక్తి, గౌరవం, సామాజికి సేవా ద్రుక్పదంతో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా విశాఖలోని పోస్టుమాస్టర్ జనరల్, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అనకాపల్లి ఎంపీ డా.సత్యవతి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, విశాఖ రాజ్య సభ్ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, రాష్ట్ర పర్యాటకశాఖ, సాంస్క్రుతికశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యల, అల్లూరి పేరుతో సేవా, చైతన్య, చరిత్రను వివరించే కార్యక్రమాలు చేపట్టే జాతీయ అల్లూరి యువజన సంఘం, అల్లూరి చరిత్రపై గత 18ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నా పరిశోధకులు పి.బాలభాను(బాలు) ద్రుష్టికి కూడా తీసుకెళ్లింది. అంతేకాకుండా ఈ గ్రామానికి భారతదేశ చరిత్రలోకానీ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోగానీ ఒక ప్రత్యేక పేజీ ఉన్న విషయన్నాకూడా వివరించింది. అయితే పోస్టల్ మార్కెటింగ్ తక్కువగా ఉండటం, ఎస్ఓకి రెండు కీలోమీటర్ల మేరే ఉండటం తదితర కారణాలతో చాలా చోట్ల బ్రాంచి పోస్టాఫీసులను రద్దు చేసి మరో చోట విలీనం చేస్తున్నామని పోస్టల్ శాఖ వివరిస్తోంది. దానికి అనుగుణంగానే ఈ ప్రాంతానికి మరో మూడు కిలోమీటర్లు దూరంలో వున్న మరో ప్రాంతంలో కూడా అల్లూరి సీతారామరాజు పోరాటం చేసిన ప్రాంతంగా అప్పటిలోనే రికార్డులు కెక్కన నల్లగొండ గ్రామంలో మరో బ్రాంచి పోస్టాఫీసుని పోస్టల్ శాఖ ఏర్పాటు చేస్తుందని కూడా ప్రచారం జరిగింది కానీ నేటి వరకూ అదికూడా కార్యరూపం దాల్చలేదు. పైగా ఇపుడు ఈ పాత క్రిష్ణదేవీపేట పోస్టాఫీసుని వేరే ప్రాంతానికి తరలించేకంటే అటు నల్లగొండ, పాత క్రిష్ణాదేవీపేటలకు ప్రాంతాలకు వీలుగా దీనినే కొనసాగించాలని ఈ ప్రాంతీయులు పోస్టల్ శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నారు. పైగా ఈ ప్రాంతంలోని ప్రజలకు అల్లూరి సీతారామరాజుకి, పోస్టాఫీసుకి ఎంతో మంచి అనుబంధం ఏన్నో ఏళ్ల నుంచి ముడిపడి వుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చేపడుతున్నా జాతీయ గ్రామీణ ఉపాది పధకం చెల్లింపుల్లో ఈ పోస్టాఫీసు ద్వారా ఎందరికో సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టాఫీసు తీసేయడం ద్వారా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. మూడు గ్రామాలకు అనుకూలంగా ఉన్న ఈ పోస్టాఫీసును ఇక్కడే ఉంచేలా పోస్టల్ శాఖ పోస్ట్ మాస్టర్ జనరల్, పోస్టల్ సూపరింటెండెంట్ లు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. అయితే అల్లూరికి గౌరవం ఇస్తూ..ఇక్కడే కొనసాగిస్తారా లేదంటే..అల్లూరి గౌరవం కంటే మాకు అత్యధిక వ్యాపారమే ముద్దు అనుకుని పూర్తిగా రద్దుచేస్తారా అనేది తేలాల్సి వుంది.