వాలంటీర్లు సెల్ ఫోన్లను అప్పగించాలి..
Ens Balu
1
Srikakulam
2021-03-06 11:56:28
శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న వాలంటీర్లు తమ అధికారిక సెల్ ఫోన్ లను తక్షణం అప్పగించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ ఆదేశించారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన జారీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం వాలంటీర్లు సెల్ ఫోన్ లు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. మునిసిపాలిటీ కార్యాలయంలో పాలనాధికారి లేదా మేనేజర్ లేదా నియమిత అధికారికి తక్షణం తమ సెల్ ఫోన్ లను అప్పగించాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్ధితుల్లో ఫోన్ చేయాల్సివస్తే మునిసిపల్ కార్యాలయానికి వచ్చి సంబంధిత అధికారి అనుమతితో, అధికారి సమక్షం నుండి ఫోన్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు మేరకు వాలంటీర్లు ఎటువంటి అనధికారిక, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదని ఆయన స్పష్టం చేసారు. అనధికారిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు పిర్యాధులు అందితే వారిపై విచారణ చేసి నిబంధనల మేరకు క్రమశిక్షణా చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేసారు. అనధికార కార్యకలాపాల్లో పాల్గొనే వాలంటీర్లపై చర్యలు చేపట్టవచ్చని డివిజన్ బెంచ్ స్పష్టంగా పేర్కొనడం జరిగిందని ఆయన తెలిపారు. వాలంటీర్లపై పిర్యాధులను కంట్రోల్ రూమ్ కు : అనధికారిక కార్యకలాపాల్లో పాల్గొనే వాలంటీర్లపై పిర్యాధులను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 08942 240605, 240606 ఫోన్ నంబర్లకు తెలియజేయాలని కలెక్టర్ కోరారు. కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిన 12 గంటల్లోగా విచారణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తీవ్ర ఆక్షేపణలు వచ్చిన వాలంటీర్లపై విచారణలో ఆరోపణలు రుజువైతే డివిజన్ బెంచ్ ఆదేశానుసారం తొలగించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.